Virushka Marriage Anniversary:  నేడు (డిసెంబర్ 11) భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ- బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహ వార్షికోత్సవం. ఈ రోజుతో వారి పెళ్లి జరిగి 5 సంవత్సరాలు పూర్తవుతోంది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట 2017 డిసెంబర్ 11న వివాహం చేసుకున్నారు. అనుష్కతో పెళ్లి జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. 


'నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీతో కలిసి జీవితాంతం చేయబోయే ప్రయాణానికి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. నాపై ఉన్న ఆశీస్సుల ఫలితంగానే నిన్ను నా జీవితంలో పొందగలిగాను' అంటూ భార్యపై ప్రేమను చాటాడు విరాట్. దీనికి అనుష్క సరదాగా స్పందించిది. 'ఇంకా నయం నువ్వు ముందుగా చెప్పాలనుకున్నది పోస్ట్ చేయలేదు' అంటూ బదులిచ్చింది. ఈ సందర్భంగా వీరివురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ పోస్ట్ పెట్టిన 2 గంటల్లోనే 4 మిలియన్లకు పైగా లైకులు సాధించింది. 


తన భార్య అనుష్క శర్మపై ఉన్న ప్రేమను కోహ్లీ సమయం వచ్చినప్పుడల్లా చూపిస్తూనే ఉంటాడు. తామిద్దరూ కలిసి దిగిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పెడుతుంటాడు. అలాగే తాను ఫాం కోల్పోయి ఇబ్బంది పడినప్పుడు అనుష్క తనకు చాలా సపోర్ట్ గా నిలిచిందని చాలా సందర్భాల్లో విరాట్ చెప్పాడు. వీరి జంటకు వామిక అనే పాప ఉంది. 






బంగ్లాతో టెస్టులకు సిద్ధమైన కోహ్లీ


ఇకపోతే విరాట్ కోహ్లీ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నాడు. డిసెంబర్ 14 నుంచి బంగ్లాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఆడనున్నాడు. ఇప్పటికే జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 1-2తో కోల్పోయింది. మొదటి రెండు మ్యాచులు బంగ్లాదేశ్ గెలవగా... చివరిదైన ఆఖరి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత వన్డేల్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఇది విరాట్ కు 71వ శతకం. దీంతో అత్యధిక శతకాలు చేసిన వారిలో రెండో స్థానానికి చేరాడు. మొదటి స్థానంలో 100 సెంచరీలతో భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా వెటరన్ రికీ పాంటింగ్ (70) నిలిచాడు.