ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో గెలుచుకున్న ప్రైజ్ మనీని శ్రీలంకలోని కుటుంబాలు, చిన్నారుల సంక్షేమానికే తిరిగి డొనేట్ చేశారు. ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో పరిస్థితులు అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే.
యూనిసెఫ్ ఆస్ట్రేలియా అంబాసిడర్ అయిన కెప్టెన్లు ప్యాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్, మిగతా ఆస్ట్రేలియా జట్టు 45 వేల ఆస్ట్రేలియా డాలర్లను (మనదేశ కరెన్సీలో సుమారు రూ.25.5 లక్షలు) యూనిసెఫ్‌కు డొనేట్ చేశారు. జూన్, జులై నెలల్లో శ్రీలంకలో పర్యటించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అక్కడ సంక్షోభం ఎలా ఉందో కళ్లారా చూసింది. పెట్రోల్ బంకుల వద్ద పెద్ద పెద్ద క్యూలు, టెస్టు మ్యాచ్ జరుగుతున్న మైదానం వెలుపల నిరసనల వంటి విషయాలను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు గ్రహించింది.
ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటడంతో దాదాపు 66 శాతం ఇళ్లలో ఆహారాన్ని బాగా తగ్గించుకున్నారు. రవాణాకు అవసరమైన పెట్రోల్ కూడా సరిగ్గా లేకపోవడంతో స్కూళ్లను వారానికి మూడు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు. కనీసం సరైన తాగు నీరు లభించడం కూడా శ్రీలంకలో కష్టం అయిపోయింది.
ఆస్ట్రేలియన్ క్రికెటర్లు డొనేట్ చేసిన నగదు యూనిసెఫ్ కార్యక్రమాల ద్వారా పౌష్టికాహారం, హెల్త్ కేర్, స్వచ్ఛమైన తాగు నీరు, విద్య, మానసిక ఆరోగ్యం వంటి సేవలకు వినియోగిస్తున్నారు. శ్రీలంకలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో తాము ప్రత్యక్షంగా చూశామని కమిన్స్ తెలిపారు.
వారు కష్టాల్లో ఉన్నప్పటికీ తమకు సాదర ఆహ్వానాన్ని అందించారని ఆరోన్ ఫించ్ శ్రీలంక ప్రజల గురించి తెలిపారు. ఆస్ట్రేలియా జట్టు 2021లో మనదేశానికి కూడా 50 వేల ఆస్ట్రేలియా డాలర్లను (సుమారు రూ.28.3 లక్షలు) ఆక్సిజన్ సిలిండర్ల కోసం డొనేట్ చేసింది. 2016 తర్వాత ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడటం ఇదే తొలిసారి. టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలుచుకోగా, వన్డే సిరీస్‌ను శ్రీలంక 3-2తో సొంతం చేసుకుంది. ఇక టెస్టు సిరీస్ 1-1తో సమం అయింది.