BCCI over IPL Team Owners: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యాజమాన్యాలను చూసి బీసీసీఐ ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం! విదేశీ లీగుల్లోకి భారత క్రికెటర్లను అనుమతించాలని ఒత్తిడి చేస్తారేమోనని కలవరపడుతోంది. ఏదేమైనా ఐపీఎల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కు పడిపోనివ్వమని స్పష్టం చేస్తోంది.


అంతర్జాతీయ క్రికెట్లో ఐపీఎల్‌ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! అత్యుత్తమ క్రికెటర్లు ఇందులో ఆడేందుకు ఎగబడతారు. రాత్రికి రాత్రే కోటిశ్వరులుగా మారతారు. అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు. ఐపీఎల్‌ను చూశాకే బిగ్‌బాష్‌, కరీబియన్‌, పీఎస్‌ఎల్‌ వంటి లీగులు వచ్చాయి.


అన్ని దేశాల్లోనూ లీగ్‌ క్రికెట్‌ విస్తరిస్తుండటంతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆ దిశగా కదులుతున్నాయి. విదేశీ టీ20 లీగుల్లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగులో నైట్‌రైడర్స్‌ అద్భుతాలు చేస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో ఆరుకు ఆరు ఫ్రాంచైజీలను భారతీయులే దక్కించుకున్నారు. ఐపీఎల్‌ ఫ్రాచైజీలే వాటినీ తీసుకున్నాయి.


'బీసీసీఐ ఐపీఎల్‌ బ్రాండ్‌ను సృష్టించింది. ఈ లీగ్‌ను చూసి క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. బీసీసీఐ దీనిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని ప్రతి టీ20 లీగుతో ఐపీఎల్‌ యాజమాన్యాలు అనుబంధం పెంచుకోవడం బోర్డును ఆందోళన కలిగిస్తుంది. ఏదేమైనా భారత అగ్రశ్రేణి క్రికెటర్లను ఇతర లీగుల్లోకి అనుమతించం. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఐపీఎల్‌ ఓనర్లకు స్వేచ్ఛ ఉంది. అయితే ఐపీఎల్‌ బ్రాండ్‌ను నీరుగార్చేందుకు మాత్రం ఒప్పుకోం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.


భారత క్రికెటర్లను తమ లీగుల్లో ఆడేందుకు అనుమతించాలని విదేశీ లీగుల నిర్వాహకులు ఎప్పట్నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు. ఆస్ట్రేలియా, కరీబియన్‌ నిర్వాహకులు ఎన్నోసార్లు కలిశారు. మాజీ క్రికెటర్లు సైతం డిమాండ్‌ చేస్తున్నారు. సెంట్రల్‌ కాంట్రాక్టు వాళ్లను కాకుండా మిగతా వారినైనా అనుమతిస్తే బాగుంటుందని కోరుతున్నారు. బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించడం లేదు.


దక్షిణాఫ్రికాలో అతిత్వరలో నిర్వహించే దేశవాళీ టీ20 లీగ్‌లో ఆరు ఫ్రాంచైజీలను ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ యజమానులు దక్కించుకున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ లీగ్‌ మొదలవుతుందని తెలిసింది.


ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ జట్టును ఎంత బాగా నడిపిస్తుందో అందరికీ తెలిసిందే. వీరు న్యూలాండ్స్‌ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. ఇక జొహన్నెస్‌బర్గ్‌ ఫ్రాంచైజీని చెన్నై సూపర్‌కింగ్స్‌ దక్కించుకుంది. దిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ ప్రిటోరియా ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమానులు డర్బన్‌ జట్టును దక్కించుకున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్లైన సన్‌ నెట్‌వర్క్‌ కెబ్రెహా, రాజస్థాన్‌ రాయల్స్‌ పార్ల్‌ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి.


టీ20 లీగ్‌ ఫ్రాంచైజీలను భారతీయులు కొనుగోలు చేసినందుకు దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం సంతోషం వ్యక్తం చేసింది. 'దక్షిణాఫ్రికా క్రికెట్‌ ఎంతో సంతోషించే క్షణాలివి. లీగ్‌కు ఇంత ఆదరణ లభించిందంటే అంతర్జాతీయ క్రికెటింగ్‌ ఎకో సిస్టమ్‌లో మనదేశం విలువేంటో అర్థం చేసుకోవచ్చు' అని లీగ్‌  కమిషనర్‌ గ్రేమ్‌ స్మిత్‌ అన్నాడు.