Pat Cummins: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన యాషెస్‌ను 2-2తో డ్రా చేసుకున్నా సిరీస్‌ను నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా జట్టుకు వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారీ షాక్ తప్పేట్లు లేదు. టెస్టులు, వన్డేలలో ఆ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న పాట్ కమిన్స్.. మణికట్టు గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో అతడు త్వరలో జరుగబోయే సౌతాఫ్రికా, ఇండియా టూర్స్‌కు మిస్ కానున్నాడు. వన్డే వరల్డ్ కపన్ ముందున్న నేపథ్యంలో అక్టోబర్ వరకైనా కమిన్స్ కోలుకుంటాడా..? అని కంగారూలు ఆందోళన చెందుతున్నారు.
ఇంగ్లాండ్‌తో ‘ది ఓవల్’ వేదికగా ముగిసిన చివరి టెస్టు ప్రారంభానికి ముందే మణికట్టు గాయమైనా.. నొప్పితోనే కమిన్స్ ఆ టెస్టును ఆడినట్టు సమాచారం. జూన్ - జులైలలో ఆరు టెస్టులు (యాషెస్‌లో ఐదు, భారత్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్) ఆడిన కమిన్స్.. ఓవల్ టెస్టులో గాయంతోనే బరిలోకి దిగినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాతో మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడాల్సి ఉంది. ఆగస్టు 30 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ టూర్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా నేరుగా సౌతాఫ్రికా నుంచి భారత్‌కు రానుంది. భారత్‌తో సెప్టెంబర్ 22 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌లు ముగిసిన తర్వాత భారత్‌లోనే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొననుంది. అయితే కమిన్స్ గైర్హాజరీలో సౌతాఫ్రికాలో వన్డేలకు స్టీవ్ స్మిత్ సారథిగా వ్యవహరిస్తాడని తెలుస్తున్నది. టీ20లలో మిచెల్ మార్ష్.. కమిన్స్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడట. అయితే వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో కమిన్స్ అక్టోబర్ వరకు కోలుకుంటాడా..? లేదా..? అన్నది అనుమానంగానే ఉంది.
ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ - గవాస్కర్ ట్రోపీ ఆడేందుకు భారత్‌కు వచ్చిన పాట్ కమిన్స్.. రెండు టెస్టులు ఆడి తిరిగి తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్ట్రేలియాకు తిరుగుప్రయాణమయ్యాడు. నాలుగో టెస్టు వరకు వస్తాడని భావించినా తన తల్లి మరణించడంతో అతడు అక్కడే ఉండిపోయాడు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్‌ను నడిపించాడు. స్మిత్ సారథ్యంలో ఇండోర్ టెస్టు గెలిచిన ఆసీస్.. అహ్మదాబాద్ టెస్టును డ్రా చేసుకుంది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది.
రెండు నెలల విరామం తర్వాత జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా భారత్‌తో ఆడిన టెస్టుతో తిరిగి జట్టుతో చేరిన కమిన్స్.. ఆసీస్‌కు డబ్ల్యూటీసీ ట్రోఫీని అందించాడు. ఆ తర్వాత యాషెస్‌లో ఆసీస్ తొలి రెండు టెస్టులను గెలుచుకున్నా తర్వాత ఇంగ్లాండ్ పుంజుకోవడంతో సిరీస్‌ను సమం చేసుకుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial