Riyan Parag: అప్‌కమింగ్ క్రికెటర్లలో టాలెంట్ ఉండి దానికంటే ఎక్కువ అగ్రెసివ్‌వెస్ అటిట్యూడ్‌తో ఉండే క్రికెటర్లలో అస్సాం కుర్రాడు రియాన్ పరాగ్ ముందువరుసలో ఉంటాడు. ఆల్ రౌండర్‌గా రాణిస్తున్న పరాగ్.. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే సోషల్ మీడియా వేదికగా భారత క్రికెటర్లలో ఎవరూ ఎదుర్కోనన్ని ట్రోల్స్ పరాగ్‌కు వస్తాయి. అతడు ఏం చేసినా, సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టినా అది ట్రోలర్స్‌కు ఫుల్ మీల్సే.. తాజాగా పరాగ్ తనపై వచ్చే ట్రోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నేనేం చేసినా వాళ్లకు సమస్యే..
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాగ్ మాట్లాడుతూ..‘చాలామందికి నేను చూయింగ్ గమ్ తిన్నా సమస్యే. కాలర్ పైకి ఎగరేసినా, క్యాచ్ పట్టిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్నా.. ఖాళీ టైమ్‌లో ఆన్‌లైన్ గేమ్స్, గోల్ఫ్ ఆడుకున్నా.. ఇలా నేను ఏం చేసినా వారికి ప్రాబ్లమే...
అసలు వాళ్లు నన్ను ఎందుకు టార్గెట్ చేసి అలా ద్వేషిస్తారో నాకు తెలియదు. క్రికెట్ ఎలా ఆడాలనేదానిపై ఒక రూల్ బుక్ ఉంటుంది. అందులో టీషర్ట్ టక్ చేసుకోవాలి, కాలర్ కిందకి ఉండాలి. అందరికీ గౌరవం ఇవ్వాలి, ఎవరినీ స్లెడ్జ్ చేయకూడదు వంటి నిబంధనలుంటాయి. అయితే నేను వాటికి పూర్తి వ్యతిరేకంగా ఉంటా.. నేను క్రికెట్ స్టార్ట్ చేసింది ఫన్ కోసమే. ఇప్పటికీ నేను క్రికెట్‌ను ఫన్ కోసమే ఆడుతున్నా. కానీ జనాలు ఇది అర్థం చేసుకోరు. నేను ఈ స్థాయిలో ఆడుతూ కూడా ఇలా చేస్తుండటం వాళ్లకు నచ్చదు. నేను కృతజ్ఞతతో ఆడటం లేదని వాళ్లు భావిస్తారు’అని చెప్పాడు.
మా అమ్మకు వాటిని చూడొద్దని చెప్పా..
నిత్యం నా మీద వచ్చే ట్రోల్స్ చూసి మా అమ్మ గతంలో చాలా బాధపడేది. ఆమెకు చెప్పిందేంటంటే నేను బాగా ఆడినా ఆడకున్నా ఈ ట్రోల్స్ వస్తాయి. నేను ఆమెకు ఒక్కటే చెప్పా. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉండమని సూచించా. ట్రోలర్స్ చేసే ట్రోలింగ్ గురించి నేను పట్టించుకోను. మా నాన్న ఇటువంటివి త్వరగా అర్థం చేసుకుంటాడు. నేను కూడా ఈ ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేశా. నేను బాగా ఆడినా ఆడకున్నా వాళ్ల (ట్రోలర్స్)కు నాతో సమస్యే..’ అని ఘాటుగా స్పందించాడు.
ఐపీఎల్ - 2023లో విఫలమైనా పరాగ్ దేశవాళీలో అదరగొడుతున్నాడు. ఇటీవలే ముగిసిన దేవ్‌ధర్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లు (ఈస్జ్ జోన్ తరఫున) ఆడిన పరాగ్ 354 పరుగులు చేయడమే గాక 11 వికెట్లు కూడా తీసి ఆల్ రౌండర్‌గా రాణించాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు ఫైనల్‌లో 95 పరుగుల ప్రదర్శన కూడా ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో పరాగ్.. ఏడు మ్యాచ్‌లలో 78 పరుగులే చేయగలిగాడు. రాజస్తాన్ రాయల్స్ అతడిని రూ. 3.8 కోట్లు వెచ్చించి వేలంలో దక్కించుకుంది. ఐపీఎల్-16లో పరాగ్ విఫలమైనప్పుడు చాలామంది రాజస్తాన్ అనవసరంగా రూ. 3.8 కోట్లు కోల్పోయిందని ట్రోలింగ్ వచ్చింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial