Men's Cricket World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి భారతదేశంలో ప్రారంభం అవుతుంది. ఇది 13వ వన్డే వరల్డ్ కప్. మొదటి సారి భారతదేశం వన్డే ప్రపంచ కప్‌కు పూర్తిగా ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిలో దేశంలోని 10 నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కావడానికి కేవలం రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉంది.


అటువంటి పరిస్థితిలో చాలా మంది మాజీ వెటరన్ ఆటగాళ్లు టోర్నమెంట్‌కు సంబంధించి వారి అంచనాలను నిరంతరం తెలుపుతూనే ఉన్నారు. ఇందులో ఇప్పుడు వెటరన్ ప్లేయర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా చేరారు. అతను సెమీ ఫైనల్‌కు చేరుకునే నాలుగు జట్లు ఇవే అంటూ జ్యోతిషం చెప్పాడు.


ఆస్ట్రేలియా జట్టు నుంచి వన్డే ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమైన గ్లెన్ మెక్‌గ్రాత్ సెమీ ఫైనల్‌కు ఎంపికైన నాలుగు జట్లతో పాటు పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలను చేర్చాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో గ్లెన్ మెక్‌గ్రాత్ అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును కలిగి ఉన్నారు.


2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్ సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ చివరి మ్యాచ్ నవంబర్ 19వ తేదీన జరగనుంది.


ఈ టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో చెన్నైలోని మైదానంలో ఆడనుంది. అక్టోబర్ 15వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీ మారవచ్చని తెలుస్తోంది.


మరోవైపు భారత్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ నాలుగు పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితం అయింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యం సాధించింది.


వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రొవ్‌మన్ పావెల్ (48: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.  తనతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ (41: 34 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించాడు. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (39: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (21: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) తప్ప ఇంకెవరూ 20 పరుగుల మార్కు దాటలేకపోయారు. 






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial