Sania Mirza-Shoaib Malik: సెలబ్రిటీ కపుల్  సానియా మీర్జా - షోయభ్ మాలిక్‌లు వివాహ బంధానికి వీడ్కోలు చెప్పబోతున్నారా..? విడాకుల గురించి అధికారిక ప్రకటన చేయకపోయినా ఈ ఇద్దరూ విడిపోయినట్టేనా..?  సామాజిక మాధ్యమాలలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.  గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య  విభేదాలు వచ్చాయని,  ఇక రేపో మాపో విడిపోతారని వస్తున్న పుకార్లను ఈ ఇద్దరూ నిజం చేస్తున్నారు. 


సోషల్ మీడియాలో మాలిక్, మీర్జాలు చేసిన పనే ఈ అనుమానాలను బలపరుస్తున్నది.  తన ఇన్‌స్టా ఖాతాలో షోయభ్ మాలిక్ బయో‌ను మార్చాడు. మొన్నటిదాకా మాలిక్ బయో‌లో ‘హస్బెండ్ టు సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని ఉండేది. తాజాగా మాలిక్ దానిని మార్చాడు. ‘ప్రో అథ్లెట్, లివ్ అన్‌బ్రోకెన్, ఫాదర్ టు వన్ ట్రూ బ్లెస్సింగ్’ అని  మార్చాడు. ‘సానియా భర్త’ అన్న  పదాన్ని  తీసేయడంతో మాలిక్ తాను   ఇండియన్ టెన్నిస్ స్టార్‌తో విడిపోయానని చెప్పకనే చెప్పాడని అతడి ఫ్యాన్స్  చెప్పుకుంటున్నారు. 






ఇక సానియా మీర్జా కూడా  తన ఇన్‌స్టాగ్రామ్‌లో షోయభ్ మాలిక్‌తో కలిసిఉన్న ఫోటోలను డిలీట్ చేసేసింది. మాలిక్ తన ఇన్‌స్టా బయో మార్చినా ఫోటోలను మాత్రం అలాగే ఉంచాడు.  మీర్జా అయితే మొత్తం వాటిని డిలీట్  చేయడంతో ఈ ఇద్దరి విడాకులు రూమర్స్ కాదని తేలిపోయిందని నెటిజన్లు వాపోతున్నారు.


 






 


2010లో పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరికీ 2018లో కొడుకు పుట్టాడు. ఆ బాబు పేరు ఇజాన్ మాలిక్. ఇజాన్ ప్రస్తుతం  తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌ (మిక్స్‌డ్ డబుల్స్) తర్వాత టెన్నిస్‌కు  గుడ్ బై చెప్పిన మీర్జా..  మార్చిలో ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు మెంటార్‌గా చేసింది. 


సుమారు ఏడాదికాలంగా ఈ ఇద్దరి విడాకులకు సంబంధించిన వార్తలు మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి.  అయితే కొద్దిరోజుల క్రితం ఈ ఇద్దరూ పాకిస్తాన్‌లో ఓ టీవీ నిర్వహించే ‘ది మీర్జా మాలిక్ షో’కు హాజరుకావడంతో  విడాకుల వ్యవహారం రూమర్సే అని అనుకున్నారు.  అదీగాక అటు మాలిక్ గానీ ఇటు మీర్జా గానీ దీనిపై ఇంతవరకూ స్పందించలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో  వాళ్లు చేసిన చర్యలు విడాకుల గురించి కన్ఫర్మ్ చేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.  అయితే ఇదే విషయమై సానియా కుటుంబసభ్యులు స్పందిస్తూ.. ‘సానియా, షోయభ్‌లో తమ వ్యక్తిగత జీవితం గురించి విడివిడిగా లేదా ఉమ్మడిగా  ఎటువంటి అధికారిక ప్రకటన చేయకూడదని భావిస్తున్నారు.  వాళ్ల  ప్రైవసీని గౌరవిస్తే బాగుంటుంది’ అని  చెప్పడం గమనార్హం.




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial