Smriti Mandhana: టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ‘ది హండ్రెడ్’లో చరిత్ర సృష్టించింది. ది హండ్రెడ్ ఉమెన్స్ లీగ్‌లో 500 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ లీగ్‌లో సౌతర్న్ బ్రేవ్ తరఫున ఆడుతున్న మంధాన.. 2023 సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ రెండు అర్థ సెంచరీలు సాధించి ఈ ఘనతను అందుకుంది.
2021లో మొదలైన ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ఇటీవలే పురుషుల సీజన్ ముగిసింది. కొద్దిరోజుల క్రితమే మొదలైన మహిళల టోర్నీలో మంధాన సౌతర్న్ బ్రేవ్ తరఫున ఆడిన రెండు మ్యాచ్‌లలో 55, 70 పరుగులతో రాణించింది. నిన్న (ఆగస్టు 4) సౌతంప్టన్ వేదికగా వెల్ష్ ఫైర్ ఉమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధాన.. 42 బంతుల్లోనే 11 ఫోర్ల సాయంతో 70 పరుగులు సాధించింది. దీంతో ఆమె ఈ లీగ్‌లో చేసిన పరుగులు 503కు చేరాయి. తద్వారా ది హండ్రెడ్ ఉమెన్స్ లీగ్‌లో 500 పరుగులు సాధించిన తొలి క్రికెటర్ మంధాన చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో ట్రెంట్ రాకెట్స్ సారథి నాట్ సీవర్ బ్రంట్ 497 పరుగులతో రెండో స్థానంలో నిలిచింది.
ఈ టోర్నీలో ఐదు వందల పరుగులు సాధించడంతో పాటు మంధాన మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వెల్ష్ ఫైర్‌తో మ్యాచ్‌లో 70 పరుగులు చేయడం ద్వారా మంధాన.. ఈ లీగ్‌లో ఐదో అర్థ సెంచరీని సాధించింది. ఇది కూడా రికార్డే. మంధాన కంటే ముందు మరో భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ నాలుగు అర్థ సెంచరీలు సాధించింది. రోడ్రిగ్స్ నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ తరఫున ఆడుతోంది.
ఇక మంధాన ప్రాతినిథ్యం వహిస్తున్న సౌతర్న్ బ్రేవ్.. ఆడిన రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచి ఒకదాంట్లో ఓడింది. తొలి మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ జట్టుతో ఈజీగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో మంధాన 36 బంతుల్లోనే 6 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసింది. కానీ రెండో మ్యాచ్‌లో సౌతర్న్ బ్రేవ్.. నాలుగు పరుగుల తేడాతో ఓడింది. నిన్న ముగిసిన మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్ తొలుత బ్యాటింగ్ చేసి 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (65, 38 బంతుల్లో, 13 ఫోర్లు) దూకుడుగా ఆడింది. అనంతరం లక్ష్య ఛేదనలో సౌతర్న్ బ్రేవ్.. వంద బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. మంధానతో పాటు డేనియల్ వ్యాట్ (37 బంతుల్లో 67, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా ఆఖర్లో విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial