AUS vs SCO Highlights, T20 World Cup 2024: స్కాట్లాండ్‌ హృదయాలను ఆస్ట్రేలియా(AUS) ముక్కలు చేసింది. చివరి ఓవర్ వరకూ పోరాడినా కంగారు చేతిలో స్కాట్లాండ్‌(SCO) జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో ఇంగ్లండ్‌(England), స్కాట్లాండ్ జట్ల పాయింట్లు సమానంగా ఉన్నా... నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా ఇంగ్లండ్ సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధించింది. తుది దాకా పోరాడినా... గెలుపు ఆశలు చెలరేగినా ఒత్తిడికి చిత్తయిన పసికూన స్కాట్లాండ్‌...ఈ టీ 20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఆస్ట్రేలియా లీగ్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి సగర్వంగా సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా స్కాట్లాండ్‌ పోరాటం క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. స్కాట్లాండ్‌ బ్యాటర్‌ బ్రాండెన్ మెక్‌ముల్లన్‌ ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. స్కాట్లాండ్‌ తరపున ఈ టీ 20 ప్రపంచకప్‌లో వేగంగా అర్ధ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 26 బంతుల్లో మెక్‌ముల్లన్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు.

అద్భుత పోరాటం


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా... స్కాట్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఓవర్‌లోనే వికెట్‌ తీసిన అగర్‌.. కంగారులకు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత జార్జే మున్సే..బ్రాండెన్ మెక్‌ముల్లన్‌ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆరంభం నుంచే స్టోయినీస్‌ బ్యాటింగ్‌కు వచ్చే వరకు స్కాట్లాండ్‌ ఆధిపత్యమే కొనసాగింది. మెక్‌ముల్లన్‌ కంగారు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. జార్జే మున్సే..బ్రాండెన్ మెక్‌ముల్లన్‌ జోడీ రెండో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నెలకొల్పుతూ కంగారులను కంగారు పెట్టింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సూపర్ 8కు అర్హత సాధించే అవకాశం ఉండడంతో స్కాట్లాండ్‌ ఆటగాళ్లు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. మెరుపు బ్యాటింగ్‌ చేసిన బ్రాండెన్‌ మెక్‌ముల్లన్‌ కేవలం 34 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 60 పరుగులు చేసి స్కాట్లాండ్‌కు మెరుగైన స్కోరు అందించాడు.  ఓపెనర్‌ మున్సే 23 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సులతో 35 పరుగులు చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 89 పరుగులు జోడించి స్కాట్లాండ్‌కు భారీ స్కోరు అందించే పునాది వేశారు. కానీ స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుట్‌ కావడంతో స్కాట్లాండ్‌ మరింత భారీ స్కోరు చేసే అవకాశాన్ని మిస్‌ చేసుకుంది. మెక్‌ముల్లన్‌ అవుటైనప్పుడు స్కాట్లాండ్‌ స్కోరు 11 ఓవర్లకు 111 పరుగులు ఉండడంతో స్కాటీష్‌ జట్టు 200కుపైగా పరుగులు చేస్తుందని అనుకున్నారు. కానీ అంత దూకుడుగా కాకపోయినా తర్వాత కూడా స్కాట్లాండ్‌ బాగానే ఆడింది. స్కాటిష్‌ జట్టు సారధి బేరింట్‌ టన్‌ 42 పరుగులతో అజేయంగా నిలవడంతో స్కాట్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కంగారు బౌలర్లలో మ్యాక్స్‌వెల్‌ 2 వికెట్లు తీశాడు.


కంగారును వణికించింది...
181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను స్కాట్లాండ్‌ వణికించింది. మ్యాచ్‌ను చివరి ఓవర్‌ వరకూ తీసుకెళ్లింది. స్టోయినీస్‌ 29 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేయకపోతే కంగారుల గెలుపు సాధ్యమయ్యేదే కాదు. ఆరంభంలో ట్రావిస్‌ హెడ్‌ 49 బంతుల్లో అయిదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. డేవిడ్‌ వార్నర్‌ 1, మార్ష్‌ 8, మ్యాక్స్‌వెల్‌11 పరుగులు చేసి వెంటనే పెవిలియన్‌కు చేరారు. స్టోయినీస్‌ పోరాటంతో చివరి ఓవర్‌లో మరో రెండు బంతులు మిగిలి ఉండగా ఆస్ట్రేలియా గెలుపొందింది.