India Canada Match Called Off Due To Wet Out Fileld:  టీ20 ప్రపంచకప్‌(T20 world Cup)లో భారత్(India), కెనడా(Canada) మధ్య జరగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి పడకుండానే రద్దైంది. భారీ వర్షం కారణంగా అవుట్‌ ఫీల్ట్‌ అంతా చిత్తడిగా మారడంతో పలుమార్లు అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. చివరకు అంపైర్లు రాత్రి తొమ్మిది గంటలకు మైదానాన్ని తనిఖీ చేసి ఆట ఆరంభించే అవకాశం లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌-కెనడా చెరో పాయింట్‌ను పంచుకున్నాయి.






గ్రూప్‌ ఏ నుంచి భారత్ ఇప్పటికే మూడు విజయాలతో సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించగా... కెనడా నిష్క్రమించింది. టీమిండియా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే కనిపిస్తున్నా విరాట్‌ కోహ్లీ ఫామ్‌ ఒక్కటే ఆందోళన పరుస్తోంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ గాడిన పడతాడని ఆశించినా మ్యాచ్‌ రద్దు కావడంతో ఆ ఆశలు నెరవేరలేదు. సూపర్‌ ఎయిట్‌ మ్యాచ్‌లోనైనా కోహ్లీ జోరందుకుంటే టీమిండియాకు ఇక తిరుగే ఉండదు.


 






 

సూపర్‌ ఎయిట్‌లో ఇలా..

ఇప్పటికే గ్రూప్‌ ఏ నుంచి అగ్రస్థానంలో సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధించిన రోహిత్‌ సేన జూన్‌ 20 అసలైన పోరును ప్రారంభించనుంది. జూన్‌ 20న అఫ్గాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. జూన్‌ 22న రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ లేదా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. జూన్‌ 24న పటిష్టమైన ఆస్ట్రేలియాతో భారత జట్టు హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో పోరు జరపనుంది. ఇందులో గెలుపు సాధిస్తే భారత్‌ సెమీస్‌కు చేరుకుంటుంది. టీ 20 ప్రపంచకప్‌ సెమీస్‌ జూన్‌ 26, 27 తేదీల్లో జరగనున్నాయి. తుది సమరం జూన్ 29న జరగనుంది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో తుది మెట్టుపై బోల్తా పడ్డ భారత జట్టు.. టీ 20 ప్రపంచకప్‌నైనా ఒడిసిపట్టాలని కసితో ఉంది. ఈసారి ఎలాగైన పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడి టీ 20 క్రికెట్‌కు వీడ్కోలు  పలకాలని రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ భావిస్తున్నారన్న వార్తలు ఉన్నాయి.