ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా  అయిదు పరుగుల తేడాతో విజయం సాధించింది. కళ్ల ముందు భారీ లక్ష్యం కనపడుతున్నా కివీస్‌ చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడింది. చివరి బంతికి ఆరు కావాల్సి ఉండగా.. స్టార్క్‌ బౌలింగ్‌లో ఫెర్గ్యూసన్ ఎలాంటి అద్భుతం చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్‌ అయింది. 389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. విజయానికి కేవలం అయిదు పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఆగిపోయింది. ఓడిపోయినా భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్‌ పోరాటం క్రికెట్‌ ప్రేమికుల హృదయాలను దోచుకుంది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో కివీస్‌-ఆసిస్‌ కొదమ సింహాల్ల పోరాడడంతో పలు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటంటే...

 

అత్యధిక పరుగులు 

వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన పోరుగా ఈమ్యాచ్‌ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 388 పరుగులు చేయగా.. కివీస్ 383 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 771 పరుగులు చేశాయి. వన్డేల్లో అత్యధిక పరుగులు నమోదైన విభాగంలో ఈ మ్యాచ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా పేరున ఉంది. 2006లో సౌతాఫ్రికా-ఆసీస్‌ మ్యాచ్‌ లో 872 పరుగులు నమోదయ్యాయి. 2009 భారత్‌-శ్రీలంక మ్యాచ్‌లో 825 పరుగులు నమోదయ్యాయి. 

 

అత్యధిక సిక్సులు

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 32 సిక్సులు బాదాయి. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన రెండో మ్యాచ్‌గా ఈ పోరు నిలిచింది.  2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 33 సిక్సర్లు నమోదవ్వగా... ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 32 సిక్సులు నమోదయ్యాయి. ప్రపంచకప్‌లో అత్యధిక బౌండరీల్లోనూ ఈ మ్యాచ్‌ రెండో స్థానంలో నిలిచింది.  ఇదే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌లో ఏకంగా 105 బౌండరీలు నమోదవ్వగా... ఆసిస్‌-కివిస్‌ మ్యాచ్‌లో 97 బౌండరీలు నమోదు అయ్యాయి. 

 

ఛేదనలో అత్యధిక పరుగులు

ప్రపంచక్‌ప్‌లో ఓటమిలో అత్యధిక స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా న్యూజిలాండ్‌ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. ఇదే వరల్డ్‌కప్‌లో లంకేయులు 344 పరుగులు చేయగా.. కివీస్‌ ఈ మ్యాచ్‌లో 383 పరుగులు చేసింది. వన్డేల్లో ఛేదనలో నాలుగో అత్యధిక స్కోర్‌ రికార్డును కూడా  న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో నమోదు చేసింది. 2006 సౌతాఫ్రికా-ఆసీస్‌ మ్యాచ్‌ టాప్‌లో ఉంది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ నిర్ధేశించిన 435 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించి దక్షిణాఫ్రికా పెను సంచలనం సృష్టించింది. 

 

స్టార్క్‌ చెత్త రికార్డు

ఆసిస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఈ మ్యాచ్‌లో చెత్త గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన స్టార్క్‌ ఒక్క వికెట్‌ కూడా తీయకుండా 89 పరుగులు ఇచ్చాడు. వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ తరఫున అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా స్టార్క్‌ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున ఆత్యధిక క్యాచ్‌లు (3) అందుకున్న ఫీల్డర్‌గా నాన్‌ వికెట్‌కీపర్‌గా స్టార్క్‌ రికార్డుల్లోకెక్కాడు.