Jasprit Bumrah has Most Wickets for Indian bowler in Test series in Australia | సిడ్నీ: ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రికార్డులు తిరగరాస్తున్నాడు. వికెట్ల వేట కొనసాగించిన బుమ్రా 46 ఏళ్ల రికార్డును బద్ధలుకొట్టాడు. 5 టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డ మీద అత్యధిక వికెట్లు (32*) తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు బుమ్రా. ఐదు టెస్టుల సిరీస్‌లో కీలకమైన చివరి టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతోంది. తొలి టెస్టుకు సారథ్యం వహించిన జస్ప్రిగ్ బుమ్రా ఐదో టెస్టుకు సైతం భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
బిషన్ సింగ్ బేడీ రికార్డు బద్ధలు
ఈ క్రమంలో భారత పేసర్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా (Australia) గడ్డ మీద 5 లేక అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు బుమ్రా. భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును బద్ధలుకొట్టాడు. 1977/ 78 సీజన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ 31 వికెట్లు తీశాడు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఇదే అత్యుత్తమం. హర్బజన్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్ లాంటి దిగ్గజ బౌలర్లు వచ్చినా ఈ రికార్డును మాత్రం అధిగమించలేకపోయారు.
లబుషేన్‌ను ఔట్ చేయడంతో బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డ్
బోర్డర్- గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో 5వ టెస్ట్ ప్రారంభానికి ముందు బుమ్రా ఈ సిరీస్ లో 30 వికెట్లు పడగొట్టాడు. సిడ్నీ టెస్టులో తొలి రోజు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన బుమ్రా శనివారం రెండో రోజు ఆటలో మార్నస్ లబుషేన్ వికెట్ తీయడంతో బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది. ఈ టెస్ట్ పూర్తయ్యే సరికి బుమ్రా మరికొన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుని మరో భారత బౌలర్‌కు అందనంత ఎత్తులో నిలవనున్నాడు.
రోహిత్‌ను తప్పిస్తే.. బుమ్రాకే టెస్ట్ పగ్గాలు
అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా బుమ్రా కొనసాగుతున్నాడు. 2024లో 13 టెస్టుల్లోనే 71 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా బుమ్రా నిలిచాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ భారత్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్‌గానూ సేవలు అందిస్తున్నాడు. అనుభవం ఉన్న కెప్టెన్లలా బుమ్రా వ్యూహాలు రచిస్తూ, అటు బౌలింగ్ లోనూ జట్టును ముందుడి నడిపిస్తున్న తీరు అమోఘం. ఒకవేళ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే బుమ్రాకు బీసీసీఐ టెస్టు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.