Asian Games 2023: ఆసియా క్రీడలలో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు తుది పోరులో  తడబడింది.   శ్రీలంకతో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన  టీమిండియా..  లంక స్పిన్నర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో  ఏడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ఓపెనర్ స్మృతి మంధాన (45 బంతుల్లో 46, 4 ఫోర్లు, 1 సిక్స్) , జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42,  5 ఫోర్లు) రాణించినా  మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. 


హాంగ్జౌలోని పింగ్‌ఫెంగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న  ఫైనల్‌తో తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది.  స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ  (9)   నిరాశపరిచింది.  16 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే  వన్ డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌‌తో కలిసి మంధాన భారత ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు  73 పరుగులు జోడించారు.  






అర్థ సెంచరీకి చేరువైన మంధాన‌ను  రణవీర ఔట్ చేసి లంకకు బ్రేక్ ఇచ్చింది.  14.5వ ఓవర్లో  మంధాన ఔట్ అయింది.  ఇక ఆ తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.  వికెట్ కీపర్ రిచా ఘోష్ (9),  కెప్టెన్ హర్మన్‌ప్రీత్  కౌర్ (2), పూజా వస్త్రకార్ (2)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. 


 






15వ ఓవర్ దాకా  మెరుగ్గానే సాగిన భారత ఇన్నింగ్స్ తర్వాత తడబాటుకు గురైనా  జెమీమా మాత్రం  పోరాడింది.  16 ఓవర్లకు  100-2గా ఉన్న భారత స్కోరు.. తర్వాత నాలుగు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే చేసి  ఐదు వికెట్లు కోల్పోయింది.  చివరి ఐదు ఓవర్లలో భారత్ చేసింది 27 పరుగులైతే ఐదు వికెట్లు నష్టపోయి  కనీసం పోరాడే టార్గెట్‌ను కూడా లంక ముందు నిలుపలేకపోయింది. 


మ్యాచ్ ఆరంభంలోనే షఫాలీని ఔట్ చేసినా తర్వాత  మంధాన - జెమీమాల భాగస్వామ్యాన్ని  విడదీసిన లంక బౌలర్లు తర్వాత  భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టారు. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఆజట్టు  మెరుగ్గా రాణించి భారత్ పరుగులు తీయకుండా అడ్డుకట్ట వేసింది.  లంక జట్టులో ఏకంగా ఏడుగురు బౌలింగ్ చేయడం గమనార్హం.  రణసింగె, ప్రబోధని, ప్రియదర్శిని, సుగంధిక కుమారి, కెప్టెన్ చమరి ఆటపట్టు, కవిశా దిల్హరి, ఇనోకా రణవీరలు భారత్ పరుగుల ప్రవాహాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు.  రణవీర, సుగంధిక, ప్రబోధనిలకు తలా రెండు వికెట్లు దక్కాయి. మరి  ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత బౌలర్లు  ఏ మేరకు డిఫెండ్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం.