IND vs AUS: వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత క్రికెట్ జట్టు తమ ఆఖరి వన్డేను ఆడేందుకు సిద్ధమవుతున్నది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇదివరకే రెండిండిలో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. రాజ్‌కోట్ వేదికగా ఈ నెల 27న జరుగబోయే ఆఖరి వన్డేకు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌లకు విశ్రాంతినిచ్చింది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య వచ్చే బుధవారం రాజ్‌కోట్ వేదికగా మూడో వన్డే జరగాల్సి ఉంది. ఇదివరకే సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న టీమిండియా.. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గిల్, ఠాకూర్‌లకు విశ్రాంతినిచ్చింది. ఆదివారం ఇండోర్‌లో రెండో వన్డే ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లంతా రాజ్‌కోట్‌కు వెళ్లగా గిల్, ఠాకూర్ మాత్రం వారితో వెళ్లలేదు. ఈ ఇద్దరూ గువహతిలో భారత జట్టుతో కలుస్తారు.
వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు గువహతి వేదికగానే ఈనెల 30న వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లాండ్‌తో జరుగబోయే ఆ మ్యాచ్‌తో భారత వరల్డ్ కప్ వేట మొదలవుతుంది. ఇదిలాఉండగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌తో పాటు రెండో వన్డేకు ముందు ఫ్యామిలీతో గడిపేందుకు వెళ్లిన జస్ప్రిత్ బుమ్రా కూడా రాజ్‌కోట్ వన్డేలో ఆడనున్నాడు. మెగా టోర్నీ నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లను నిత్యం ఫ్రెష్‌గా ఉంచేందుకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అవసరాన్ని బట్టి ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ ఏడాది గిల్ బీస్ట్ మోడ్‌లో ఉన్నాడు. 2023లో ఓపెనర్‌గా ప్రమోట్ అయిన ఈ పంజాబ్ కుర్రాడు.. ఇటీవలే తన హోంగ్రౌండ్ మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో రాణించాడు. తొలి వన్డేలో మిస్ అయినా ఇండోర్‌లో సెంచరీ చేశాడు. గిల్‌కు ఈ ఏడాది వన్డేలలో ఇది ఐదో సెంచరీ. మొత్తంగా ఆరో శతకం. వన్డే వరల్డ్ కప్‌కు ముందు అతడు ఫుల్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు మరింత ధీమానిచ్చేదే. ఈ ఏడాది వన్డేలలో ఆడిన 20 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 72.35 సగటుతో 1,230 పరుగులు చేసిన గిల్.. మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్-16 లో కూడా సెంచరీల మోత మోగించిన విషయం తెలిసిందే.
ఇక శార్దూల్ ఆసియా కప్‌లో ఫర్వాలేదనిపించినా ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో గాడితప్పాడు. తొలి వన్డేలో 10 ఓవర్లు వేసి ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్న శార్దూల్.. రెండో వన్డేలో కూడా దారుణ ప్రదర్శన నమోదుచేశాడు. ఇండోర్‌లో నాలుగు ఓవర్లే వేసిన శార్దూల్.. 8.80 ఎకానమీతో 35 పరుగులిచ్చుకున్నాడు. కాస్త గ్యాప్ ఇచ్చి అతడిని ఫ్రెష్‌గా బరిలోకి దించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరి వార్మప్ మ్యాచ్ నాటికైనా శార్దూల్ మునపటి లయను అందుకుంటాడో లేదో చూడాలి..