Asian Games 2023: ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్ నడుమ  చైనాలోని హాంగ్జౌ వేదికగా నిర్వహించబోయే ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టును పంపకూడదన్న   కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంపై టీమిండియా ఫుట్‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్ స్పందించాడు.  ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న యువ, ప్రతిభావంతమైన ఆటగాళ్లపై   కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. ఆటపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని  వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి  ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. కేంద్ర నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కోరాడు.  


ట్విటర్ వేదికగా  స్టిమాక్ స్పందిస్తూ.. ‘గౌరవనీయ  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర  మోడీ గారికి,  గౌరవ క్రీడా శాఖ మంత్రి   అనురాగ్  ఠాకూర్ గారికి  నా  వినమ్రపూర్వక విన్నపం.. ఆసియా క్రీడల్లో   ఆడేందుకు భారత ఫుట్‌బాల్ జట్టుకు  అవకాశం కల్పించండి. మేం మన దేశం  గర్వపడేవిధంగా  పోరాడతాం. జై హింద్!’ అని రాసుకొస్తూ ఓ లేఖను షేర్ చేశారు. 


 






క్రొయేషియా వాస్తవ్యుడైనా స్టిమాక్ భారత ఆటగాళ్లతో బాగా కలిసిపోయాడు. అతడి  మార్గనిర్దేశకత్వం, కెప్టెన్ సునీల్ ఛెత్రి సారథ్యంలో భారత్ ఇటీవల  ఇంటర్ కాంటినెంటల్ కప్‌తో పాటు  శాఫ్  టైటిల్ కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అగ్రెసివ్ అటిట్యూడ్‌తో ఉండే  స్టిమాక్.. గతనెలలో భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా  పాకిస్తాన్ ఆటగాడి  చేతి నుంచి బంతిని తోసేయడం,  నేపాల్‌తో మ్యాచ్‌లో కూడా దురుసు ప్రవర్తనతో ఓ మ్యాచ్ నిషేధానికి గురైన విషయం తెలిసిందే.  నిషేధం ఎదుర్కున్నా తన టీమ్ కోసం ఏదైనా చేయడానికి తాను సిద్ధమని  ప్రకటించి స్టిమాక్.. ఆటగాళ్లలో ధైర్యం కోల్పోకుండా చేశాడు. 


కాగా.. ఆసియా క్రీడలలో అండర్ - 23 స్థాయిలోనే ఫుట్‌బాల్ ఆడిస్తున్నారు. జట్టులో ముగ్గురు మాత్రం అంతకంటే ఎక్కువ వయసున్నా అనుమతిస్తారు. ఆడేది అండర్ - 23 అయినా  కేంద్ర ప్రభుత్వం మాత్రం  ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ టీమ్‌ను పంపకూడదని నిర్ణయం తీసుకోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. వాస్తవానికి  సెప్టెంబర్ 7 నుంచి 10 వరకూ థాయ్‌లాండ్ వేదికగా జరిగే  కింగ్స్ కప్  ముగిసిన తర్వాత.. స్టిమాక్ నేతృత్వంలోని  భారత ఫుట్‌బాల్ టీమ్.. థాయ్‌లాండ్ నుంచి నేరుగా హాంగ్జౌకు వెళ్తుందని భావించారు. 


కానీ ఆసియా క్రీడల్లో జరుగబోయే టీమ్ ఈవెంట్స్ పోటీలలో టాప్ - 8 ర్యాంకులో ఉన్న జట్లనే ఆసియా క్రీడలకు పరిగణించాలని  క్రీడల మంత్రిత్వ శాఖ.. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఎ), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్) లకు లేఖ రాసింది. ఆసియాలో ఫుట్‌బాల్ ఆడే జట్లలో టాప్ -10 లో భారత్ లేదు.  ప్రస్తుతం భారత ర్యాంకు 18గా ఉంది.  




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial