Team India Head Coach: టీమిండియాకు కొత్త హెడ్‌కోచ్ రానున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆగస్టు 13 నుంచి ఇక్కడే ఉండనుంది.  ఈ సిరీస్ ముగిసిన తర్వాత  టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ  టూర్‌లో భారత జట్టుకు టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనుంది.  ద్రావిడ్‌తో పాటు అతడి సిబ్బంది (బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే) కి కూడా రెస్ట్ ఇచ్చేందుకు బీసీసీఐ అంగీకారం తెలిపింది. ఈ స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) హెడ్  వీవీఎస్ లక్ష్మణ్  బృంధాన్ని  నియమించనుంది. 


ఆగస్టు 18 నుంచి  ఐర్లాండ్‌తో మూడు  టీ20లు ఆడనున్న  భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది.   ద్రావిడ్ అండ్ కో. ప్లేస్‌లో  వీవీఎస్ లక్ష్మణ్ (హెడ్‌కోచ్)తో పాటు  సితాన్షు కోటక్, ట్రాయ్ కోలే, సాయిరాజ్ బహుతులేలు  బాధ్యతలు స్వీకరించనున్నారు.  హార్ధిక్ పాండ్యా ఈ సిరీస్‌కు సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.  


గతేడాది కూడా  భారత  జట్టు ఐర్లాండ్ టూర్‌కు వెళ్లినప్పుడు వీవీఎస్ లక్ష్మణే హెడ్‌కోచ్ గా వ్యవహరించాడు.   టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత  కూడా  న్యూజిలాండ్ సిరీస్‌లోనూ అతడే హెడ్ కోచ్‌ గా ఉన్నాడు.   దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. దీనివల్ల ఆటగాళ్లకు హెడ్ కోచ్‌తో   అనుబంధం ఎలా ఏర్పడుతుందని  విమర్శించారు. గతేడాది సిరీస్‌కు ఒక కెప్టెన్, సిరీస్‌కు ఓ హెడ్ కోచ్ అన్న విధంగా భారత జట్టు ప్రయాణం సాగింది. అయితే ఈ ఏడాది  ఆస్ట్రేలియాతో  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత రెండు నెలల పాటు ద్రావిడ్, అతడి సిబ్బందికి  విశ్రాంతి దొరొకింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత  కూడా నెల రోజుల పాటు టీమిండియా  ఖాళీగానే ఉంది.  ఇప్పుడు నెల రోజులకే    ద్రావిడ్, అతడి సిబ్బందికి  రెస్ట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని  అభిమానులు వాపోతున్నారు. అయితే బీసీసీఐ వర్గాలు మాత్రం.. ఆసియా కప్, తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో  కోచ్‌లకు బిజీ షెడ్యూల్ ఉండనుందని.. దీనికోసం  ప్రిపేర్ అవడానికి వారికి బ్రేక్ కావాలని  చెబుతున్నాయి. 


 






ఐర్లాండ్‌ vs భారత్‌, టీ20 షెడ్యూల్..


ఆగస్టు 18 :  ఐర్లాండ్‌ vs భారత్‌ - తొలి టీ20, మలహైడ్‌ 
ఆగస్టు 20 :  ఐర్లాండ్‌ vs భారత్‌ - రెండో టీ20, మలహైడ్‌ 
ఆగస్టు 23 :  ఐర్లాండ్‌ vs భారత్‌ - మూడో టీ20, మలహైడ్‌ 


ఆగస్టు 13న  విండీస్‌తో టీ20 సిరీస్ ముగిశాక..  రాహుల్ ద్రావిడ్ అండ్ కో. యూఎస్ నుంచి నేరుగా భారత్‌కు రానున్నారు.  ఐర్లాండ్‌కు ఎంపికయ్యే  టీమ్ మెంబర్స్  యూఎస్ నుంచి ఐర్లాండ్‌కు వెళ్తారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన   జితేశ్ శర్మ, రింకూ సింగ్, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్లు.. ఐర్లాండ్‌తో సిరీస్ ఆడే అవకాశాలున్నాయి. 




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial