Virat Kohli Record: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్తేమీ కాదు.  తన సుదీర్ఘ కెరీర్‌లో వందలాది రికార్డులు సాధించిన ఈ రన్ మిషీన్.. వెస్టిండీస్‌తో డొమినికా వేదికగా ముగిసిన తొలి టెస్టు విజయం తర్వాత అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.  భారత జట్టుకు అత్యధిక విజయాలలో భాగస్వామ్యమైన ఆటగాళ్ల జాబితాలో  అతడు  మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని  అధిగమించి  సచిన్ రికార్డుల వైపు పరుగులు తీస్తున్నాడు.  


భారత జట్టు తరఫున ఆడుతూ అత్యధిక విజయాలలో భాగస్వామ్యమైన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరాడు. విండీస్‌పై విజయం  కోహ్లికి.. టీమిండియా తరఫున 296వ గెలుపు.  మహేంద్ర సింగ్ ధోని (295 విజయాలు)  రికార్డును కోహ్లీ  బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. 307 మ్యాచ్ ల‌తో  అందరికంటే ముందున్నాడు. భారత్ తరఫున కోహ్లీ మరో 12 మ్యాచ్‌లను గెలిస్తే  అతడు సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉంటుంది. రోహిత్ శర్మ 277 విజయాలలో భాగమయ్యాడు. 


సచిన్, ద్రావిడ్‌ల సరసన.. 


వెస్టిండీస్‌తో ఈనెల 20 నుంచి  జరుగబోయే రెండో టెస్టు ద్వారా కోహ్లీ  మరో అరుదైన క్లబ్‌లో చేరనున్నాడు.  విండీస్‌తో రెండో టెస్టు కోహ్లీకి తన కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్.  అంతర్జాతీయ క్రికెట్‌లో 500 ప్లస్ మ్యాచ్‌లు ఆడిన  క్రికెటర్ల జాబితాలో  కోహ్లీ  పదోవాడిగా నిలుస్తాడు. భారత్ నుంచి ముగ్గురు క్రికెటర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఒకసారి ఆ జాబితాను చూస్తే.. 


- సచిన్ టెండూల్కర్ : 664 మ్యాచ్‌లు
- జయవర్దెనే (శ్రీలంక) : 652 మ్యాచ్‌లు 
- కుమార సంగక్కర ( శ్రీలంక) : 594 మ్యాచ్‌లు
- సనత్ జయసూర్య ( శ్రీలంక) : 586 మ్యాచ్‌లు
- రికీ పాంటింగ్ (ఆసీస్) : 560 మ్యాచ్‌లు
- ఎంఎస్ ధోని : 538 మ్యాచ్‌లు
- షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) : 524 మ్యాచ్‌లు
- జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా) : 519 మ్యాచ్‌లు
- రాహుల్ ద్రావిడ్ : 509 మ్యాచ్‌లు
- ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్తాన్) :  499 మ్యాచ్‌లు
- విరాట్ కోహ్లీ : 499 మ్యాచ్‌లు 


 






 






టాప్ - 10 లో ఉన్నవారిలో ముగ్గురు (సచిన్, ధోని, ద్రావిడ్)  టీమిండియా నుంచే ఉన్నారు.  విండీస్‌తో మ్యాచ్ ద్వారా కోహ్లీ ఆడితే 500 ప్లస్ గేమ్స్ ఆడినవారిలో నాలుగోవాడు అవుతాడు. భారత్ తరఫున 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఆడిన కోహ్లీ.. తన కెరీర్‌లో 75 శతకాల సాయంతో 25,461 పరుగులు సాధించాడు. సచిన్.. 664 మ్యాచ్‌లలో వంద సెంచరీల సాయంతో 34,357 పరుగులు సాధించడం గమనార్హం. సచిన్ ఖాతాలో 201 వికెట్లు కూడా ఉన్నాయి. కోహ్లీ తన కెరీర్ మొత్తంలో 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial