RCB in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్  ప్రారంభ సీజన్  నుంచి ఆడుతున్నా ఇప్పటికీ  కప్ కొట్టని  జట్టుగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది.  ఐదేండ్లుగా ఆ జట్టుతో  ఉన్న కోచింగ్ స్టాఫ్  మెంబర్స్   సంజయ్ బంగర్ (గత రెండు సీజున్లుగా హెడ్‌కోచ్),  టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సెన్‌లను తొలగించనున్నట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో ఆర్సీబీకి కొత్త హెడ్‌కోచ్‌గా  ఆ జట్టు మాజీ ఆటగాడు, దక్షిణాఫ్రికా మాజీ సారథి  ఏబీ డివిలియర్స్‌ను నియమించనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 


2018 సీజన్ నుంచి హెస్సెన్,  బంగర్‌లు ఆర్సీబీతో  జర్నీ కొనసాగిస్తున్నారు. మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు  ప్రస్తుత కెప్టెన్  ఫాఫ్ డుప్లెసిస్‌తో కూడా వీరికి మంచి అనుబంధముంది.   అయితే  సీజన్లు గడుస్తున్నా  ఆర్సీబీకి మాత్రం ట్రోఫీ సాధించడం ప్రతిసారీ కలగానే మిగిలిపోతోంది.  16 సీజన్లు ముగిసినా తమకంటే తక్కువ  క్రేజ్ ఉన్న జట్లు  ట్రోఫీలు సాధించినా.. రెండు సీజన్లుగా ఆడుతున్న  గుజరాత్ టైటాన్స్ రెండు సార్లూ ఫైనల్ చేరి ఓ కప్ కూడా కొట్టిన నేపథ్యంలో వచ్చే ఏడాదైనా  ఆ కలను నెరవేర్చుకునేందుకు పకడ్బందీ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది.  


ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనం మేరకు..  బంగర్, హెస్సెన్ ఇద్దరితో పాటు కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేయాలని  ఆర్సీబీ భావిస్తున్నది.   16 ఏండ్లుగా రొడ్డకొట్టుడు ‘ఈ సాలా కప్ నమ్‌దే’ నినాదంతో కాకుండా  వచ్చే ఏడాది కొత్త ఐడియాలతో ముందుకు వెళ్లాలని  ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రచిస్తున్నది. ఈ క్రమంలో  తమకు  ట్రోఫీ కరువు తీర్చే విధంగా కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే స్టాఫ్‌ను నియమించుకోవాలని   చూస్తున్నది. 


 






హెడ్‌కోచ్‌గా ఏబీడీ.. 


సంజయ్ బంగర్, హెస్సెన్‌లను  వచ్చే ఏడాది ఆర్సీబీ  పక్కకు పెట్టనున్న నేపథ్యంలో  ఆర్సీబీకి హెడ్‌కోచ్‌గా ఎవరు రాబోతున్నారన్న  ఆసక్తి ఆ జట్టు అభిమానుల్లో నెలకొంది. ఆ జట్టుకు గతంలో సుదీర్ఘకాలం పాటు ఆడిన దక్షిణాఫ్రికా దిగ్గజం, అభిమానులు ముద్దుగా ‘మిస్టర్ 360’ అని పిలుచుకునే  ఏబీ డివిలియర్స్ హెడ్‌కోచ్‌గా రానున్నట్టు  ఆర్సీబీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్సీబీ మేనేజ్‌మెంట్.. డివిలియర్స్‌తో చర్చలు సాగిస్తున్నదని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశమున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఇదే నిజమైతే మళ్లీ కోహ్లీ - డివిలియర్స్‌ల జోడీని   వీక్షించొచ్చని అభిమానులు  అనుకుంటున్నారు. 


ఐపీఎల్- 16 లో వైఫల్యాల తర్వాత పలు జట్లు ఇప్పటికే తమ కోచింగ్ స్టాఫ్‌ను మార్చుతున్నాయి.  ఇదివరకే లక్నో సూపర్ జెయింట్స్.. రెండేండ్లుగా జట్టుతో ఉన్న ఆండీ ఫ్లవర్‌ను  తప్పించి   ఆసీస్ దిగ్గజం జస్టిన్ లాంగర్‌ను నియమించింది.  ఢిల్లీ క్యాపిటల్స్ కూడా  అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్న  షేన్ వాట్సన్, అజిత్ అగార్కర్‌లను విడుదల చేసింది.  రికీ పాంటింగ్ కూడా  వచ్చే సీజన్‌లో ఢిల్లీకి హెడ్‌కోచ్‌గా ఉండేది అనుమానమేనని, ఈ స్థానాన్ని సౌరవ్ గంగూలీ భర్తీ చేసే అవకాశమున్నట్టు సమాచారం. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా గౌతం గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial