Asian Games 2023:  వచ్చే నెలలో  చైనా వేదికగా  జరుగబోయే ఆసియా క్రీడలలో పాల్గొనబోయే  భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు  తాత్కాలిక హెడ్‌‌కోచ్‌లు రానున్నారు.  సెప్టెంబర్  23 నుంచి అక్టోబర్ 8 మధ్య చైనాలోని హాంగ్జో వేదికగా జరుగబోయే  ఈ  క్రీడల్లో  భారత క్రికెట్ జట్లు కూడా పాల్గొననుండగా  పురుషుల టీమ్‌కు ఎన్సీఎ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్, మహిళల జట్టుకు హృషికేష్ కనిత్కర్‌లు కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.  


వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రెగ్యులర్ ఆటగాళ్లు  ఆ సన్నాహకాల్లో ఉండటంతో ఆసియా క్రీడలలో  భారత పురుషుల జట్టు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతోంది.  రుతురాజ్ గైక్వాడ్ ఈ టీమ్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు.    ప్రస్తుతం బెంగళూరులో శిక్షణ పొందుతున్న గైక్వాడ్ అండ్ కో.కు లక్ష్మణ్  మార్గనిర్దేశనం చేస్తున్నాడు. ఆసియా క్రీడలతో పాటు ఆసియా కప్‌లో పాల్గొనబోయే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు కూడా లక్ష్మణ్  సూచనలు ఇస్తున్నాడు.  కాగా.. ఆసియా క్రీడలలో  లక్ష్మణ్‌కు తోడుగా సాయిరాజ్ బహుతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి (ఫీల్డింగ్ కోచ్)లు యంగ్ ఇండియాను నడిపించనున్నారు. 






ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళల జట్టును  కనిత్కర్ నడిపించనున్నాడు. కనిత్కర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో  భారత జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. మహిళల జట్టుకు కోచ్ రేసులో అమోల్ మజుందార్ ముందంజలో ఉన్నా   ఈ ఏడాది డిసెంబర్ నుంచి కొత్త కోచింగ్ టీమ్ రానుండటంతో ఆసియా క్రీడలకు కనిత్కర్ తాత్కాలిక బాధ్యతలు మోయనున్నాడు. కనిత్కర్‌తో పాటు సుభాదీప్ ఘోష్ (ఫీల్డింగ్ కోచ్), రజిబ్ దత్తా (బౌలింగ్ కోచ్) లు టీమిండియాకు  మార్గనిర్దేశనం చేయనున్నారు.


 






ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ముఖేష్ కుమార్, శివమ్  దూబే, ప్రభ్‌సిమ్రన్ సింగ్, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్


మహిళల జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా ఛెత్రి, అనూష బారెడ్డి, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్,  దీప్తి శర్మ, రిచా ఘోష్ , అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి సర్వని, టిటాస్ సాధు 






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial