PBC vs BCCI: 


పీసీబీ వ్యవహారం పాకిస్థాన్‌ రాజకీయాలను తలపిస్తోంది.  ఒక పట్టాన స్థిర నిర్ణయాలు తీసుకోవడం లేదు. అటు ఐసీసీ ఇటు బీసీసీఐని ఇబ్బంది పెట్టేందుకు పదేపదే ప్రయత్నిస్తోంది. మొన్నటి వరకు ఆసియాకప్‌ను హైబ్రీడ్‌ మోడల్‌లో ఆడించేందుకు తీవ్ర కసరత్తులు చేసింది. సభ్యదేశాలను కలిసి మాట్లాడింది. ఇప్పుడు నజమ్‌ సేథీ స్థానంలో మరో కొత్త ఛైర్మన్‌ రాబోతుండటంతో పాత నిర్ణయాలను సమీక్షిస్తోంది!


పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌గా ఎంపికవుతున్న జకా అష్రాఫ్‌ ఆసియాకప్‌ను హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు అంగీకరించడం లేదు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ తమకు ఆతిథ్య హక్కులు ఇచ్చిందని.. అలాంటప్పుడు టోర్నీ మొత్తం తమ దేశంలోనే నిర్వహించాలని పట్టుబడుతున్నాడు.


'నేను మొదటి నుంచీ చెప్పేది ఒకటే! హైబ్రీడ్‌ మోడల్‌ను తిరస్కరిస్తున్నాను. గతంలోనూ ఇదే మాట చెప్పాను. ఆసియాకప్‌ను పాక్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. అలాంటప్పుడు మేమే ఆతిథ్యం ఇవ్వాలి' అని అఫ్రాఫ్‌ అంటున్నాడు. మరోవైపు అతడి మాటల్ని ఏసీసీ వ్యతిరేకిస్తోంది. 'ఆసియా కప్‌ మోడల్‌ను ఏసీసీ అంగీకరించింది. అందులో మార్పులేమీ ఉండవు. తనకు ఇష్టమొచ్చింది మాట్లాడే స్వేచ్ఛ అష్రాఫ్‌కు ఉంది' అని ఏసీసీ బోర్డు సభ్యుడు ఒకరు స్పష్టం చేశారు.


చాలా చర్చల తర్వాత హైబ్రీడ్‌ మోడల్‌ను ఏసీసీ ఆమోదించింది. బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జేషా ఇందుకు అంగీకరించాడు. పాక్‌లో నాలుగు, శ్రీలంకలో మిగిలిన మ్యాచులు ఆడేలా షెడ్యూలు రూపొందించారు. అంటే నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ మ్యాచులకు లాహోర్‌ వేదికగా ఉంటుంది. బోర్డులో అస్థిరత, సందిగ్ధం నెలకొనడంతో పీసీబీ ఛైర్మన్‌గా తాను తప్పుకుంటున్నానని నజమ్‌ సేథీ ప్రకటించడంతో చివరి 49 గంటల్లో పరిస్థితి తారుమారు అయింది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial


కొత్తగా ఎంపిక అవుతున్న అఫ్రాఫ్‌ గతంలో పీసీబీకి ఛైర్మన్‌గా పనిచేశాడు. ఆతిథ్య హక్కులు ఇచ్చినప్పుడు కొన్ని మ్యాచుల్నే పాక్‌లో నిర్వహించేందుకు తాను ఒప్పుకోనని ఆయన మీడియా సమావేశంలో చెప్పాడు. 'అసలైన మ్యాచులన్నీ పాకిస్థాన్‌ బయటే జరుగుతున్నాయి. నేపాల్‌, భూఠాన్‌ వంటి జట్లే ఇక్కడ ఆడుతున్నాయి. అది పాకిస్థాన్‌కు అన్యాయమే అవుతుంది. దేశ క్రికెట్ భవిష్యత్తు కోసం పాత నిర్ణయాలను సమీక్షిస్తాను. పీసీబీకి కొన్ని సవాళ్లు ఉన్నాయి. పరిష్కరించుకోవాల్సి సమస్యలు ఉన్నాయి. ఆసియాకప్‌, ప్రపంచకప్‌, జట్టు సన్నద్ధమవ్వడం వంటివి చాలా ఉన్నాయి. నేనిప్పుడే ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడను. ఎందుకంటే ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించలేదు' అని ఆయన పేర్కొన్నాడు. 


టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరీసు ఆడాయి. అప్పుడు అష్రాఫే పీసీబీ ఛైర్మన్‌గా ఉన్నాడు. ఇప్పుడాయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితులు అస్థిరంగా మారాయి. ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌ షెడ్యూలు మరింత ఆలస్యం కానుంది. ఐసీసీ, ఏసీసీ మళ్లీ పీసీబీతో చర్చించాల్సి ఉంటుంది.