WI vs IND: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత  భారత జట్టు  ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు.  సుమారు నెల రోజుల విరామం తర్వాత  టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. జులై 12 నుంచి డొమినికా వేదికగా  రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. టీమిండియా డబ్ల్యూటీసీ  2023-25 సైకిల్ కూడా ఈ సిరీస్‌తోనే ప్రారంభమవనుంది. అయితే  ఈ  సిరీస్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా..? రీషెడ్యూల్ అవనుందా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 


కారణమేంటి..? 


జులై 12న  ఇండియా - వెస్టిండీస్ మధ్య  తొలి టెస్టు మొదలుకావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం  కరేబియన్ జట్టు  ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా  జింబాబ్వేలో ఉంది.  అక్కడ   క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు  ఆడుతున్నది.  ఈ ఏడాది   భారత్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో వెస్టిండీస్  అర్హత సాధించాలంటే  ముందు ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లలో టాప్ - 2లో నిలవాల్సి ఉంది.  


గ్రూప్ - ఏలో ఉన్న వెస్టిండీస్..  జూన్ 18న జరిగిన  యూఎస్ఎతో జరిగిన మ్యాచ్‌లో గెలిచింది.  ఇంకా లీగ్ దశలో విండీస్.. నేపాల్, జింబాబ్వే, నెదర్లాండ్స్ తో  ఆడాల్సి ఉంది.  లీగ్ దశ ముగిశాక సూపర్ సిక్సెస్ దశ  జరగనుంది.  ఈ సూపర్ సిక్సెస్ క్వాలిఫై అయి  ఈ  స్టేజ్‌లో టాప్ - 2 లో ఉన్న జట్లే వరల్డ్ కప్ ఆడతాయి. అందుకే విండీస్‌కు  సూపర్ సిక్సెస్‌లో టాప్ స్థానానికి చేరుకోవడం ముఖ్యం. ఈ దశ ముగియడానికి   జులై 9 కానుంది.  భారత్ - వెస్టిండీస్ మధ్య జులై 12 నుంచి డొమినికా వేదికగా   ఫస్ట్ టెస్టు మొదలుకావాల్సి ఉంది. 


హరారే (జింబాబ్వే) నుంచి కరేబియన్ దీవి అయిన డొమినికా రాజధాని   రొసోకు చేరడం, లాజిస్టికల్ ఇష్యూస్ వంటి అన్ని తతంగాలు పూర్తవడానికి కనీసం  రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.  అంటే   విండీస్ జట్టుకు హరారే నుంచి వచ్చి నేరుగా   భారత్‌తో టెస్టు ఆడాల్సి ఉంటుంది. ఇది ఆ జట్టును దెబ్బతీసేదే. 


 






ఆడేది నలుగురే.. 


అయితే ఐసీసీ క్వాలిఫయర్స్‌లో ఉన్న  వెస్టిండీస్ టీమ్‌లో  నుంచి టెస్టు మ్యాచ్‌లకు ఆడేది నలుగురు మాత్రమే. మిగతా టీమ్స్ మాదిరే  విండీస్‌కు కూడా ఫార్మాట్‌కు  ఓ టీమ్ ఉంది. కానీ టెస్టు, వన్డేలు ఆడే ప్లేయర్లలో ప్రస్తుతం  జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రోస్టన్ ఛేజ్, అల్జారీ జోసెఫ్‌లు మాత్రమే జింబాబ్వేలో ఆడుతున్నారు. ఈ నలుగురిని  సూపర్ సిక్సెస్ ముగిసేవరకూ కాకుండా వారం రోజులు ముందుగానే విండీస్‌కు తీసుకువస్తామని, మిగతా టీమ్ అంతా సూపర్ సిక్సెస్ దశ ముగిసేదాకా అక్కడే ఉంటుందని  క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రతినిధులు తెలిపారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial