Asia Cup, Ind vs Pak: ఆసియా కప్ - 2023లో భాగంగా మరో రెండు రోజుల్లో  జరుగబోయే దాయాదుల పోరుకు  వర్షం ముప్పు పొంచి ఉంది.  సెప్టెంబర్ 2న  భారత్ - పాక్‌ల మధ్య  పల్లెకెల వేదికగా జరుగనున్న పోరులో వరుణుడు షాకిచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి.  మ్యాచ్ జరగాల్సి ఉన్న శనివారం  క్యాండీ‌లో  వర్షం పడే అవకాశం 70 శాతం దాకా ఉందని వాతావరణ శాఖ  అంచనా వేస్తుండటంతో  ఇరు దేశాలతో పాటు  ప్రపంచవ్యాప్తంగా దాయాదుల పోరును వీక్షించాలని  ఎదురుచూస్తున్న అభిమానులకు  షాక్ తప్పేలా లేదు. 


వన్డేలలో నాలుగేండ్ల తర్వాత  భారత్ - పాకిస్తాన్‌‌లు  ముఖాముఖి పోరుకు దిగడం ఇదే తొలిసారి.   చిరకాల ప్రత్యర్థులు చివరిసారిగా ఇంగ్లాండ్‌లో నిర్వహించిన  2019 వన్డే వరల్డ్ కప్‌లో తలపడ్డాయి.  ఆ తర్వాత పలుమార్లు టీ20లలో  ఆడినా చివరిసారి  భారత్ - పాక్ మ్యాచ్ జరిగి కూడా పది నెలలు  కావొస్తుంది.  2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో  మెల్‌బోర్న్ వేదికగా ఇరు జట్లు చివరి మ్యాచ్ ఆడాయి.  కాగా   రెండు వారాల వ్యవధిలో భారత్ - పాక్‌లు మూడుసార్లు తలపడే (ఇరు జట్లు ఫైనల్ చేరితే) ఈ మ్యాచ్‌లను చూసేందుకు  ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు  ఆసక్తిగా వేచి చూస్తున్నా వరుణ దేవుడు మాత్రం  వారికి షాకిచ్చేందుకు సిద్ధమయ్యాడని వాతావరణ శాఖ అంచనాలను బట్టి తెలుస్తోంది. 


మ్యాచ్ జరుగబోయే  పల్లెకెల (క్యాండీ)లో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశాలు 70 శాతం వరకూ ఉన్నాయని   యూకే వాతావరణ శాఖ తెలిపింది.  ఈ మ్యాచ్ మూడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా  అదే సమయానికి వాన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  సాయంత్రం 5.30 గంటల వరకు కూడా వర్షం కురిసే అవకాశాలు 60 శాతం ఉన్నాయని శ్రీలంక వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదివరకే  పల్లెకెల స్టేడియంలో శనివారం నాటి మ్యాచ్‌కు టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. హై ఓల్టేజ్ డ్రామాగా సాగే  ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు  ఇదివరకే భారత్ - పాక్ అభిమానులు లంకలో మకాం వేశారు.  మరి వీరి ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా..?  లేక మ్యాచ్‌ను సజావుగా సాగనిస్తాడా..? అన్నది త్వరలోనే తేలనుంది. కాగా ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు గాను  భారత జట్టు బుధవారం శ్రీలంకలో అడుగుపెట్టింది. 


 






 






బుధవారం  నేపాల్‌తో ముగిసిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్.. 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 50‌ ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151),  ఇఫ్తికార్ అహ్మద్ (109)తో పాటు మహ్మద్ రిజ్వాన్ (44) లు రాణించారు. అనంతరం భారీ ఛేదనలో నేపాల్.. 23.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయింది. 





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial