Highest Wicket-Taker in T20I:  న్యూజిలాండ్ స్టార్ పేసర్, టీ20లలో ఆ జట్టు  సారథిగా వ్యవహరిస్తున్న టిమ్ సౌథీ.. పొట్టి ఫార్మాట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కివీస్.. తొలి టీ20లో జోస్ బట్లర్ సేనతో జరిగిన తొలి  మ్యాచ్‌లో  ఓపెనర్ జానీ బెయిర్ స్టో‌ను ఔట్ చేసి ఈ ఫార్మాట్‌‌‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌‌గా రికార్డులకెక్కాడు. గతంలో బంగ్లాదేశ్  స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ పేరిట ఉన్న  ఈ రికార్డును అధిగమించి నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. 


ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో  భాగంగా  తొలి ఓవర్లోనే  ఇంగ్లీష్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో  (4)ను  ఔట్ చేయడంతో   టీ20లలో సౌథీ వికెట్ల సంఖ్య 141కు చేరింది.  దీంతో అతడు ఈ ఫార్మాట్‌‌లో షకిబ్‌ను దాటేశాడు.  ఈ మ్యాచ్‌కు ముందు  హసన్ (117 మ్యాచ్‌లలో 140 వికెట్లు), సౌథీ (110 మ్యాచ్‌లలో  140 వికెట్లు)తో సమానంగా ఉండేవారు. కానీ  బెయిర్ స్టో వికెట్ తీయడంతో సౌథీ  హసన్‌ను అధిగమించి నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.  ఈ రికార్డుకు ఇప్పట్లో వచ్చిన నష్టం కూడా ఏమీలేదు. బంగ్లాదేశ్ ఇప్పట్లో టీ20లు ఆడటం లేదు.  మరోవైపు  కివీస్.. ఇంగ్లాండ్‌తో మరో రెండు టీ20లు ఆడాల్సి ఉంది.  దీంతో సౌథీ వికెట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. 


అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో టాప్ - 5 బౌలర్లు : 


1. టిమ్ సౌథీ - 141 వికెట్లు 
2. షకిబ్ అల్ హసన్ - 140
3. రషీద్ ఖాన్ - 130 
4. ఇష్ సోధి - 119
5. లసిత్ మలింగ - 107 


 






తొలి మ్యాచ్ ఇంగ్లాండ్‌దే.. 


టిమ్ సౌథీ మెరిసినా  న్యూజిలాండ్‌కు తొలి టీ20లో ఓటమి తప్పలేదు.  తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌట్ అయింది. గ్లెన్ ఫిలిప్స్ (41) ఒక్కడే టాప్ స్కోరర్. ఇంగ్లాండ్ బౌలర్లలో లూక్ వుడ్, బ్రైడన్ కార్స్‌లు తలా మూడు వికెట్లు తీశారు. స్పిన్నర్లు అదిల్ రషీద్, మోయిన్ అలీ, లివింగ్‌స్టోన్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.  


 






అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తొలి ఓవర్లోనే బెయిర్ స్టో వికెట్ కోల్పోయినా  బెదరలేదు.  విల్ జాక్స్ (12 బంతుల్లో 22), డేవిడ్ మలన్ (42 బంతుల్లో 54), హ్యారీ బ్రూక్ (27 బంతుల్లో 43 నాటౌట్) లు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇరు జట్ల మధ్య  రెండో  టీ20 శుక్రవారం (సెప్టెంబర్ 1) న మాంచెస్టర్ వేదికగా జరుగనుంది.





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial