Asia Cup 2023:  చాలాకాలం తర్వాత  స్వదేశంలో  ఓ  మల్టీ నేషన్స్  టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్‌‌.. తమ తొలి మ్యాచ్‌ను మాత్రం ఖాళీ స్టేడియంలోనే ఆడింది.  ఈ టోర్నీని చూసేందుకు పాకిస్తాన్ అభిమానులు కోకొల్లలుగా తరలివస్తారని పాకిస్తాన్ క్రికెట్  బోర్డు (పీసీబీ) గంపెడాశలు పెట్టుకుంది.  రెండు  మూడు రోజుల క్రితం అయితే  పాకిస్తాన్ - నేపాల్ ఆడబోయే ముల్తాన్ స్టేడియంలో 27 వేల సీటింగ్ కెపాసిటీ ఉండగా  అందులో 25 వేల టికెట్లూ అమ్ముడుపోయాయని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.  కానీ వాస్తవం దానికి చాలా విరుద్ధంగా ఉంది. 


ముల్తాన్ వేదికగా నిన్న ముగిసిన  మ్యాచ్ ఖాళీ స్టేడియంలోనే జరిగింది.  90 శాతం కుర్చీలు ఖాళీగానే దర్శనమిచ్చాయి.  సుదీర్ఘకాలం తర్వాత ఓ భారీ  టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చినా.. బాబర్ ఆజమ్ అండ్ కో. ఆటను స్వదేశంలో వీక్షించడానికి  స్థానిక అభిమానులెవరూ అంతగా ఆసక్తి చూపలేదు.  స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చినోళ్లు కూడా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ఉన్నారు. 


మ్యాచ్ మధ్యలో డ్రోన్ ద్వారా ఫుల్ స్టేడియాన్ని వీడియో తీయగా  అందులో 90 శాతం చైర్లు ఖాళీగానే కనిపించాయి. దీంతో  సామాజిక మాధ్యమాలలో  నెటిజన్లు పాకిస్తాన్ టీమ్‌తో పాటు పీసీబీనీ ఆటాడుకున్నారు.  కొంతమంది అయితే ‘నిజం చెప్తున్నా. నా స్కూల్ క్రికెట్ మ్యాచ్‌ను చూడటానికి ఇంతకంటే రెట్టింపు మంది వస్తారు..’ అని  ట్రోల్స్ చేస్తున్నారు. మరికొంతమంది ‘పాకిస్తాన్‌లో క్రికెట్‌కు క్రేజ్ ఫుల్ ఉంటుంది అంటారు కదా.  ఏది మరి..?  కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు.  అంతేగాక ‘ఆసియా కప్ మొత్తం  తమ దేశంలోనే కావాలని  పాకిస్తాన్ పట్టుబట్టింది. ఈ ఖాళీ కుర్చీలు  చూసేందుకేనా..? థ్యాంక్ గాడ్, ఈ టోర్నీ శ్రీలంకలో కూడా జరుగడం  చాలా శుభపరిణామం’ అంటూ పీసీబీని ఏకిపారేస్తున్నారు. 


 






 






ఆసియా కప్  ప్రారంభాన్ని  పీసీబీ గట్టిగానే ప్లాన్ చేసింది.  ప్రముఖ పాక్ సింగర్  అయిమా బేగ్, నేపాల్‌కు చెందిన గాయని తిషాలా గురుంగ్‌ల ప్రదర్శన కూడా చప్పగానే సాగింది.  ప్రేక్షకులెవరూ లేకపోవడంతో  ఓపెనింగ్ సెర్మనీ 15 నిమిషాల్లోనే ముగిసింది. దీనిపైనా  ట్రోల్స్ వెల్లువెత్తాయి.  పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా  పీసీబీని ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పించారు. 


 







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial