ఆసియా కప్‌-2023ని పాకిస్థాన్ విజయంతో మొదలుపెట్టింది. నేపాల్ పై 238 పరుగుల భారీ తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. లక్ష్య చేధనలో పసికూన నేపాల్ తడబాటుకు లోనైంది. 343 పరుగుల భారీ లక్ష్యంలో బ్యాటింగ్ కు దిగిన నేపాల్ 104 పరుగులకే ఆలౌటైంది. దాంతో పాక్ భారీ విజయంతో ఆసియా కప్ ను షురూ చేసింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 2 వికెట్లు, హ్యారిస్ రౌఫ్  2 వికెట్లు, నసీం షా  ఒక వికెట్ తో రాణించారు. నేపాల్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేదు. కుశాల్ (8), ఆసిఫ్ షేక్ (5) త్వరగా వికెట్లు చేజార్చుకున్నారు. ఆరిఫ్ షేక్, సోంపాల్ కామి ఫరవాలేదనిపించారు.


ఆసియాకప్‌ టోర్నీలో ఫస్ట్‌టైమ్ అడుగు పెట్టిన నేపాల్‌ను పాకిస్థాన్‌ ఒక రేంజులో ఆడుకుంది. పసికూన అని చూడకుండా వీర బాదుడు బాదేసింది. ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యం ఉంచింది. 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 342 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ (151; 131 బంతుల్లో 14x4, 4x6) మరోసారి సొగసరి శతకంతో జట్టును ముందుండి నడిపించాడు. అతడికి తోడుగా ఇఫ్తికార్ (109*; 71 బంతుల్లో 11x4, 4x6) దూకుడైన సెంచరీతో మెరిశాడు.


ఆకట్టుకున్న నేపాలీ బౌలర్లు
ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బ్యాటర్లకు అనులిస్తున్నా మందకొడిగా ఉంది. దాంతో బాబర్‌ ఆజామ్‌ సేనకు శుభారంభం దక్కలేదు. 25 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోరు 21 వద్దే ఓపెనర్ ఫకర్‌ జమాన్‌ (14) ఔటయ్యాడు. కరన్‌ బౌలింగ్‌లో అసిఫ్ షేక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మరో 4 పరుగులకే ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (5) రనౌట్‌ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ (44; 50 బంతుల్లో 6x4) క్రీజులో నిలబడ్డారు. ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తూనే చక్కని బంతుల్ని డిఫెండ్‌ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 106 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో పాకిస్థాన్‌ 21.2 ఓవర్లకు 100 పరుగుల మైలురాయి అందుకుంది. జోరు పెంచే క్రమంలో.. హాఫ్‌ సెంచరీకి ముందు రిజ్వాన్‌ రనౌట్‌ అయ్యాడు. 23.4వ బంతికి అతడు పరుగు తీస్తుండగానే అయిరీ నేరుగా నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో అద్భుతమై త్రో విసిరాడు. వికెట్లు ఎగిరిపోవడంతో రిజ్వాన్‌ పెవిలియన్‌కు చేరక తప్పలేదు.


బాబర్, ఇఫ్తికార్‌ విధ్వంసం
ఒకవైపు వికెట్లు పడుతున్నా బాబర్‌ ఆజామ్‌ జోరు కొనసాగించాడు. 72 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. అఘా సల్మాన్‌ (5) ఔటయ్యాక అతడికి ఇఫ్తికార్‌ అహ్మద్‌ తోడయ్యాడు. ఒకట్రెండు ఓవర్లు గడిపాక వీరిద్దరూ నేపాలీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఐదో వికెట్‌కు 131 బంతుల్లో 214 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇఫ్తికార్‌ హాఫ్‌ సెంచరీ (43 బంతుల్లో) చేసిన వెంటనే బాబర్‌ శతకం (109 బంతుల్లో) అందుకున్నాడు. ఆపై వీరిద్దరూ పోటీపడి మరీ ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. ఎంతలా అంటే.. మరో 20 బంతుల్లోనే బాబర్‌ 50 పరుగులు సాధించి 150 పూర్తి చేశాడు. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డ ఇఫ్తికార్‌ 67 బంతుల్లోనే సెంచరీ బాదేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో 2 వికెట్లు పడ్డప్పటికీ పాక్‌ స్కోరు 342కి చేరుకుంది. నేపాల్‌లో సోంపాల్‌ కామి 2 వికెట్లు పడగొట్టాడు. కరన్‌ కేసీ, సందీప్‌ లామిచాన్‌ చెరో వికెట్‌ తీశారు.