Shaheen Afridi: ఆసియా కప్ - 2023లో  భాగంగా  బుధవారం పసికూన నేపాల్‌ను మట్టికరిపించిన పాకిస్తాన్.. శనివారం భారత్‌తో జరిగే కీలక పోరులో తలపడనుంది.  శ్రీలంక వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌కు ముందే పాకిస్తాన్‌కు భారీ షాక్ తాకే అవకాశాలున్నాయి. నేపాల్‌తో మ్యాచ్‌లో పాక్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది గాయంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.  ఈ మ్యాచ్‌లో ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన  అఫ్రిది.. ముల్తాన్ వేడిని కూడా తట్టుకోలేకపోయాడు. 


నేపాల్‌తో మ్యాచ్‌లో  ఐదు ఓవర్లు వేసి  తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసిన  అఫ్రిదికి  కాలిగాయం తిరగబెట్టింది.  గతేడాది శ్రీలంకతో జులైలో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడి  మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న అఫ్రిది.. 2022లో ఆసియా కప్ కూడా ఆడలేకపోయాడు.  అక్టోబర్ - నవంబర్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొన్నా పెద్దగా ప్రభావం చూపలేదు.  పూర్తిస్థాయిలో కోలుకున్నా   గాయం తిరగబెట్టడంతో అఫ్రిది మైదానంలో ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. దానికి తోడు ముల్తాన్‌లో అధిక ఉష్ణోగ్రతలను కూడా షహీన్ భరించలేకపోయాడు.  రాత్రి పూట కూడా  ముల్తాన్‌‌లో 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గాయంతో పాటు వేడిని తట్టుకోలేక  అఫ్రిది ఫీల్డ్ లో ఇబ్బందిపడ్డాడు.  


 






అఫ్రిది అసౌకర్యాన్ని  గమనించిన  కోచింగ్ సిబ్బంది అతడిని  మ్యాచ్ మధ్యలోనే   పెవిలియన్‌కు పంపింది.   సెప్టెంబర్ 2న భారత్‌తో కీలక మ్యాచ్ ఉండటంతో   ఎలాంటి రిస్క్ తీసుకోవడానికీ   పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేదు. భారత్‌తో మ్యాచ్  పాకిస్తాన్‌కు చాలా కీలకం. వన్డే వరల్డ్ కప్‌కు ముందు  చిరకాల  ప్రత్యర్థితో  గెలిచి పైచేయి సాధించాలనే పట్టుదలతో పాకిస్తాన్ ఉంది. ఈ క్రమంలో పాక్ టీమ్‌కు షహీన్ చాలా కీలకమవుతాడు. కొత్తబంతితో తనదైన స్వింగ్‌తో  అఫ్రిది.. భారత టాపార్డర్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టగలడు.  అఫ్రిది దూరమైతే మిగిలిన బౌలర్లు  ఆ స్థాయిలో రాణించడం కష్టమే. దీంతో పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ ముందస్తు చర్యలలో భాగంగా అఫ్రిదిని పెవలియన్‌కు పంపింది. 


 






ఇక నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 50‌ ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151),  ఇఫ్తికార్ అహ్మద్ (109)తో పాటు మహ్మద్ రిజ్వాన్ (44) లు రాణించారు. అనంతరం భారీ ఛేదనలో నేపాల్.. 23.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయింది.ఆ జట్టులో సోమ్‌పాల్ కమి 28 పరుగులతో టాప్ స్కోరర్‌‌‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో అఫ్రిదితో పాటు హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా స్పిన్నర్ షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా, మహ్మద్ నవాజ్‌లు తలా ఒక వికెట్ తీశారు.




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial