AFG Vs SL, Innings Highlights: 


ఆసియాకప్‌ 2023లో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక ఫర్వాలేదనిపించింది. ప్రత్యర్థికి మంచి టార్గెట్టే ఇచ్చింది. 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ (92; 84 బంతుల్లో 6x4, 3x6) అదరగొట్టాడు. త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ఓపెనర్‌ పాథుమ్‌ నిసాంక (41; 40 బంతుల్లో 6x0), చరిత్‌ అసలంక (36; 43 బంతుల్లో 2x4, 1x6) రాణించారు. గుల్బదిన్‌ నయీబ్‌ 4, రషీద్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టారు.


ఓపెనర్ల శుభారంభం


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకేయులకు శుభారంభమే లభించింది. ఓపెనర్లు పాథుమ్‌ నిసాంక, కరుణరత్నె (32) తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం అందించారు. అఫ్గాన్‌ బౌలర్లను ఎదుర్కొని బౌండరీలు సాధించారు. వీరిద్దరినీ గుల్బదిన్‌ నయీబ్‌ పెవిలియన్‌కు పంపించాడు. 10.2వ బంతి నిసాంక, 14.4వ బంతికి కరుణరత్నె వికెట్‌ కీపర్‌ నజీబుల్లా జర్దాన్‌కు క్యాచ్‌ ఇచ్చారు. సదీర సమర విక్రమ (3) సైతం త్వరగానే ఔటయ్యాడు.


నిలబడ్డ మెండిస్‌


వరుస వికెట్ల పతనంతో ఇబ్బందుల్లోకి జారుకున్న లంకను మెండిస్‌, అసలంక ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 99 బంతుల్లో 102 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే బౌండరీలు బాదేశారు. దాంతో సింహళీయులు 27.3 ఓవర్లకు 150 పరుగుల మైలురాయికి చేరుకున్నారు. 55 బంతుల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన మెండిస్‌ ఆపై మరింత సమయోచితంగా ఆడాడు. సొగసైన బౌండరీలు బాదాడు. అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జట్టు స్కోరు 188 వద్ద అసలంకను ఔట్‌ చేయడం ద్వారా నయీబ్‌ విడదీశాడు. అప్పుడు మెండిస్‌కు ధనంజయ డిసిల్వా (14) అండగా నిలిచాడు. వీరిద్దరూ 29 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యం అందించారు.


ఆఖర్లో ఆ ఇద్దరు!


ఐదు పరుగుల వ్యవధిలోనే ధనంజయ, మెండిస్‌ ఔటవ్వడంతో శ్రీలంక స్కోరు వేగం కాస్త తగ్గింది. క్రీజులో కుదురుకున్నాక దునిత్‌ వెల్లలగె (33 నాటౌట్‌), మహీశ థీక్షణ (28) అదరగొట్టారు. ఒక్కో పరుగూ జోడించారు. ఎనిమిదో వికెట్‌కు అత్యంత కీలకమైన 64 (63 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించారు. శ్రీలంకను పటిష్ఠ స్థితికి చేర్చారు. జట్టు స్కోరును 291/8కు చేర్చారు. అఫ్గాన్‌ కనీసం 76 బంతులు మిగిలుండగానే ఈ టార్గెట్‌ను ఛేదించాలి. లేదంటే ఇంటికెళ్లక తప్పదు.


శ్రీలంక: పాథుమ్‌ నిసాంక, దిముతు కరుణరత్నె, కుశాల్‌ మెండి్‌, సదీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ శనక, దునిత్‌ వెల్లలగె, మహీశ్‌ థీక్షణ, కసున్‌ రజిత, మతీశ పతిరణ


అఫ్గాన్ ఎలా గెలవాలంటే..?


రెండ్రోజుల క్రితం  లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా  బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో  ఓడిన అఫ్గానిస్తాన్‌కు  నేడు లంకతో జరుగబోయే మ్యాచ్ అత్యంత కీలకం.  గ్రూప్ - బి పాయింట్ల పట్టికలో  శ్రీలంక ఒక్క మ్యాచ్ ఆడి   గెలిచి  రెండు పాయింట్లతో  టాప్ పొజిషన్‌లో ఉంది.  బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో ఓడి మరోదాంట్లో గెలిచి  రెండు పాయింట్లతో లంకతో సమానంగా ఉంది.  కానీ అఫ్గాన్  ఒక్క మ్యాచ్ ఆడి  అందులో ఓడింది.   ఈ మ్యాచ్ ‌లో గెలిచినా అఫ్గాన్ ఖాతాలో రెండు పాయింట్లే చేరతాయి.  


నెట్ రన్ రేట్ విషయంలో అఫ్గాన్ (-1.780) పరిస్థితి మిగిలిన జట్లతో పోలిస్తే దారుణంగా ఉంది. శ్రీలంక (+0.951), బంగ్లాదేశ్ (+0.373)లు మెరుగ్గానే ఉన్నాయి.  నేటి మ్యాచ్‌లో అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ చేస్తే కనీసం  275 పరుగులు చేసి  ఆ తర్వాత లంకపై 70 పరుగుల తేడాతో గెలవాలి. అలా కాకుండా తొలుత  బౌలింగ్ చేస్తే లంక విధించే ఎంత టార్గెట్‌ను అయినా  35 ఓవర్లలోనే ఛేదించాలి. అప్పుడు  అఫ్గాన్ జట్టు నెట్ రన్ రేట్ మెరుగవుతుంది. అయితే లంకకు ఈ లెక్కలన్నీ అవసరం లేదు గానీ  సూపర్ - 4 రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాలి.  ఓడితే భారీ తేడా లేకుండా చూసుకున్నా ఆ జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు.