India World Cup Squad: ఈ ఏడాది స్వదేశంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆడనున్న భారత క్రికెట్ జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ టీమ్‌లో తెలుగు క్రికెటర్లలో ఇద్దరికైనా చోటు దక్కుతుందని ఆశించగా తిలక్ వర్మను పట్టించుకోని సెలక్టర్లు.. పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం అవకాశం ఇచ్చారు. గడిచిన ఏడాదికాలంగా వన్డేలలో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ తుది జట్టులో ఉండటం ఖాయమే. మరి సిరాజ్ కంటే ముందు వరల్డ్ కప్ ఆడిన తెలుగు క్రికెటర్లు ఎంతమంది..? ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
ఉత్తరాది ఆధిపత్యం ఎక్కువగా ఉండే భారత క్రికెట్ జట్టులో తెలుగు క్రికెటర్లు ఆదినుంచే సత్తా చాటుతున్నారు. భారత క్రికెట్ జట్టుకు మొట్టమొదటి సారథి ఒక తెలుగువాడే అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇండియా.. ఇంగ్లాండ్‌తో ఆడిన తొలి టెస్టుకు సారథిగా వ్యవహరించింది కటారి కనకయ్య నాయుడు (సీకే నాయడుగా పిలిచేది ఈయననే) నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సేవలందించాడు. ఆ తర్వాత 1990వ దశకంలో మహ్మద్ అజారుద్దీన్ ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గానే గాక సారథిగా కూడా భారత జట్టుకు విశిష్ట సేవలందించాడు.
తొలి వరల్డ్ కప్ నుంచి త్వరలో మొదలయ్యే ప్రపంచకప్‌లో ఆడబోయే భారత జట్టులో ఎంపికైన తెలుగు క్రికెటర్ల జాబితా ఇక్కడ చూద్దాం..
1975 నుంచి వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న భారత్‌కు తొలి ప్రపంచకప్‌లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం దక్కలేదు. కానీ 1979 వరల్డ్ కప్‌లో మాత్రం భరత్ రెడ్డి (ప్రముఖ తమిళ హీరో విశాల్ అన్న, నిర్మాత విక్రమ్ కృష్ణ భార్య శ్రీయా రెడ్డి ఈయన కూతురే) చోటు దక్కించుకున్నాడు. కానీ ఆయన రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. భారత క్రికెట్ జట్టు చరిత్రలో సువర్ణధ్యాయంగా లిఖించదగ్గ 1983 వరల్డ్ కప్‌లో తెలుగు క్రికెటర్లకు ప్రాతినిథ్యం దక్కలేదు.
అజహార్ యుగం ప్రారంభం..
1987 వన్డే ప్రపంచకప్‌లో మాత్రం భారత జట్టులో హైదరాబాదీ మహ్మద్ అజారుద్దీన్ చోటు దక్కించుకున్నాడు. కపిల్ దేవ్ తర్వాత భారత జట్టును నడిపించింది అజారుద్దీనే. 1987 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు సారథి కూడా హైదరాబాదీయే. ఇదే టోర్నీలో ఆంధ్రా నుంచి స్పిన్నర్ వెంకటపతి రాజు కూడా చోటు దక్కించుకున్నాడు. 1996 వరల్డ్ కప్‌లో కూడా అజారుద్దీనే సారథిగా వ్యవహరించగా.. నాటి జట్టులో వెంకటపతిరాజు సైతం చోటు సంపాదించాడు. 1999 వన్డే వరల్డ్ కప్‌లోనూ సారథి అజారుద్దీన్. ఆ టోర్నీలో అజారుద్దీన్ తప్ప మరే తెలుగు క్రికెటర్ వరల్డ్ కప్ స్క్వాడ్‌లో లేడు. వరుసగా మూడు వన్డే వరల్డ్ కప్‌లకు సారథిగా వ్యవహరించిన అజహార్.. ఆట నుంచి తప్పుకున్నాడు.
ఆ తర్వాత నిరాశే..
2003లో సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ ఆడింది. ఈ జట్టులో ఒక్క తెలుగు క్రికెటర్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. అప్పటికీ వీవీఎస్ లక్ష్మణ్ బ్యాటర్‌గా స్థిరపడ్డా అతడు టెస్టులకే పరిమితమయ్యాడు. టీమిండియాకు గతంలో చీఫ్ సెలక్టర్‌గా పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఒక్క వన్డే వరల్డ్ కప్ కూడా ఆడలేకపోయాడు. 2007లో ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో ప్రంచకప్ ఆడిన భారత జట్టులోనూ ఒక్క తెలుగు క్రికెటర్ కూడా లేడు. 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులోనూ తెలుగు క్రికెటర్ల ప్రాతినిథ్యం కనిపించలేదు.
రాయుడి రాక.. సిరాజ్ పక్కా..
కానీ 2015 వన్డే వరల్డ్ కప్‌లో మాత్రం అంబటి రాయుడు రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో రోహిత్ శర్మ ఉన్నప్పటికీ అతడు ఆడింది ముంబై నుంచే. రోహిత్ తల్లి విశాఖపట్నం వాసి అయినా అతడు ముంబైకర్‌గానే చెప్పుకుంటాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో రాయుడును కాదని విజయ్ శంకర్‌కు చోటు దక్కింది. తాజాగా మహ్మద్ సిరాజ్ ఇరు తెలుగు రాష్ట్రాల తరఫున భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial