ODI World Cup 2023: 


ప్రపంచ టోర్నీల్లో టీమ్‌ఇండియా ప్రదర్శనపై బయట ఏమనుకుంటున్నారో తమకు అవసరం లేదని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. జట్టులోని ఆటగాళ్లంతా ప్రొఫెషనల్స్‌ అని పేర్కొన్నాడు. 15 మందినే ఎంపిక చేస్తున్నప్పుడు ఊహించని సర్‌ప్రైజ్‌లేమీ ఉండవన్నాడు. చోటు దక్కని క్రికెటర్లు బాధపడొద్దని, ఇలాంటి పరిస్థితిని తానూ గతంలో ఎదుర్కొన్నానని గుర్తు చేశాడు.


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కలిసి మీడియా సమావేశంలో ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు. అదే సమయంలో ప్రపంచ టోర్నీల్లో భారత ప్రదర్శనపై ప్రజల వైఖరేంటో తెలుసా అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. హిట్‌మ్యాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పదేపదే ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారని అడిగాడు. ఇప్పటికే ఎన్నోసార్లు దీని జవాబు ఇచ్చానని అసహనానికి గురయ్యాడు.


'ఈ ప్రశ్నకు నేనెన్నో సార్లు జవాబిచ్చాను. బయట ఏం జరుగుతుందో మేం పట్టించుకోం. జట్టులోని ఆటగాళ్లంతా ప్రొఫెషనల్స్‌. ఇలాంటివి నన్ను అడగకండి. నేనైతే అలాంటివి ప్రశ్నించను. వీటి గురించి చర్చించడంలో అర్థం లేదు. మా దృష్టి మరోదానిపై ఉంది. అలాంటి విషయాలను పట్టించుకొనేంత తీరిక లేదు' అని రోహిత్‌ శర్మ అన్నాడు.


వన్డే ప్రపంచకప్‌కు ఎంపికైన వారిలో దాదాపుగా ఆసియాకప్‌ ఆడుతున్నవారే ఉన్నారు. కేవలం ఇద్దరినే పక్కకు తప్పించారు. కుర్రాడు తిలక్‌ వర్మ, పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణకు మాత్రమే చోటు దక్కలేదు. దీని గురించి మాట్లాడుతూ ఎప్పుట్నుంచో అనుకుంటున్న జట్టు ఇదేనన్నాడు. పెద్దగా మార్పులేమీ లేవన్నాడు.


'సర్‌ప్రైజులేమీ లేవు. జట్టులో 15 మందే ఉంటారు కదా! కొందరు ఆటగాళ్లు నిరాశ పడొచ్చు. నేనూ ఈ పరిస్థితి ఎదుర్కొన్నాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనకు ఆల్‌రౌండ్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. మాకు దొరికిన అత్యుత్తమ 15 మంది వీళ్లే' అని రోహిత్‌ శర్మ తెలిపాడు.


'మేం ప్రణాళికలపై ఇంకా ఆలోచించలేదు. అన్నీ ఎక్కువే ఉండటం మంచి సమస్యే! ఫామ్‌లో ఎవరున్నారు? ప్రత్యర్థి ఎవరన్నది చూడాల్సి ఉంటుంది. వీలైన అత్యుత్తమ కూర్పు గురించి ఆలోచించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరికి చోటు దక్కదు. ఇలాంటివి జరుగుతుంటాయి. జట్టు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది' అని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు.


బ్యాటింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు సాయం చేయడంపై బౌలింగ్‌ యూనిట్‌ ఆలోచిస్తోందని రోహిత్‌ తెలిపాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో బౌలర్లూ పరుగులు చేస్తున్నారని గుర్తు చేశాడు. 'చక్కని బ్యాటింగ్‌ డెప్త్‌ను రూపొందించుకోవాలి. డెప్త్‌ విషయంలో 8, 9 స్థానాలు అత్యంత కీలకం. కొన్నిసార్లు మా బ్యాటింగ్‌లో వైఫల్యాలు ఎదురవుతున్నాయి. కేవలం ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడమే బౌలర్ల బాధ్యత కాదు. వాళ్లూ పరుగులు చేయాలి. గెలుపు, ఓటములకు 10-15 పరుగుల అంతరం చాలు' అని వివరించాడు.


'పరిస్థితులను గమనించాలి. ఆరుగురు బౌలర్లూ తలో పది ఓవర్లు బౌలింగ్‌ చేయరు కదా! ఆ వికెట్‌ ఏ బౌలర్‌కు ఎక్కువ అనుకూలిస్తుందో చూడాలి. కొన్నిసార్లు స్పిన్నర్లు తమ పూర్తి 20 ఓవర్ల కోటాను పూర్తి చేయలేని రోజులు ఉంటాయి' అని హిట్‌మ్యాన్‌ వివరించాడు.