Asia Cup 2023, SL vs BAN: ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ ‘ఖేల్’ ఖతమైనట్టే. గ్రూప్ స్టేజ్‌లో లంక చేతిలో ఓడి అఫ్గాన్‌పై భారీ తేడాతో గెలిచిన ఆ జట్టు.. సూపర్-4కు అర్హత సాధించినా ఫైనల్‌కు చేరాలంటే అద్భుతం జరగాల్సిందే. శనివారం కొలంబో లోని ప్రేమదాస స్టేడియం వేదికగా ముగిసిన కీలక పోరులో ఆ జట్టు ఓటమిపాలవడంతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యే స్థితికి చేరింది.
నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. లంక మిడిలార్డర్ బ్యాటర్ సమరవిక్రమ (72 బంతుల్లో 93, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (73 బంతుల్లో 50, 6 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు.
మోస్తారు లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తడడబడింది. ఓపెనర్ మహ్మద్ నయీం (21) మరోసారి విఫలమయ్యాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన మెహిది హసన్ మిరాజ్ (28) కూడా నిలువలేకపోయాడు. లిటన్ దాస్ (15) విఫలమవగా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (3), వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ (29) లు కూడా నిరాశపరిచారు. కానీ మిడిలార్డర్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ (97 బంతుల్లో 82, 7 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. లంక బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి బంగ్లాపై ఒత్తిడిపెంచారు. ఆఖరికి బంగ్లాదేశ్.. 48.1 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లంక 21 పరుగుల తేడాతో గెలుపొందింది. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, దసున్ శనక, పతిరానలు తలా మూడు వికెట్లు పడగొట్టారు.
ఈ ఓటమితో షకిబ్ సేన టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే. సూపర్ - 4లో స్వంత గ్రూప్‌లో ఉన్న టీమ్‌తో పాటు ప్రత్యర్థి గ్రూపులో ఉన్న రెండు జట్లతో తలా ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇదివరకే పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడి ఓడిన పాకిస్తాన్.. లంకతోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆ జట్టు తదుపరి మ్యాచ్ భారత్‌తో ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ - ఎ నుంచి పాకిస్తాన్ గానీ భారత్ గానీ తదుపరి రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో ఓడితే బంగ్లాకు ఏమైనా అవకాశాలుంటాయి. అది కూడా బంగ్లా.. భారత్‌ను భారీ తేడాతో ఓడిస్తేనే.. ఇవన్నీ జరగాలంటే అద్భుతాల మీద భారం వేయాల్సిందే..
లంక రికార్డు విజయం..
బంగ్లాదేశ్‌ను ఓడించడంతో శ్రీలంక ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. నిన్నటి మ్యాచ్‌లో విజయం లంకకు వరుసగా 13వ గెలుపు. వన్డేలలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా.. 21 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానం శ్రీలంకదే. 2003 జూన్ 11 నుంచి 2003 మే వరకు ఆస్ట్రేలియా వన్డేలలో అప్రతీహాత విజయాలు సాధించింది. ఇక శ్రీలంక.. 2023 జూన్ నుంచి నిన్నటి మ్యాచ్ వరకూ ఆడిన 13 వన్డేలలో ఓటమనేదే లేకుండా దూసుకుపోతున్నది. అఫ్గాన్, యూఏఈ, ఓమన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లపై ఆ జట్టు విజయాలు సాధించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial