Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ  పాకిస్తాన్‌తో అర్థాంతరంగా ఆగిన   సూపర్ - 4 మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు 78 పరుగులు చేస్తే  పదివేల పరుగుల క్లబ్‌లో  చేరే అవకాశం ఉన్న  రోహిత్.. 22 పరుగుల తేడాతో ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. అయితే పదివేల  పరుగుల మైలురాయి మిస్ అయినా  రోహిత్ ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు  తనపేరిట లిఖించుకున్నాడు.  ఆసియా కప్ చరిత్రలో అత్యధిక  సిక్సర్లు బాదిన  ఆటగాడిగా పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డును హిట్‌మ్యాన్ సమం చేశాడు.  


పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో  49 బంతుల్లో  ఆరు బౌండరీలు,  నాలుగు భారీ సిక్సర్లతో విరుచుకుపడిన  రోహిత్ శర్మ.. ఇప్పటివరకూ  ఆసియా కప్‌‌లో (వన్డేలలో) 26 సిక్సర్లు కొట్టాడు.  ఈ క్రమంలో రోహిత్.. షాహిద్ అఫ్రిది 26 సిక్సర్ల రికార్డును సమం చేశాడు. అయితే  26 సిక్సర్లు బాదడానికి షాహిద్ అఫ్రిది  21 ఇన్నింగ్స్ తీసుకుంటే  రోహిత్ మాత్రం 24 ఇన్నింగ్స్‌లలో  ఈ ఘనతను అందుకున్నాడు.   పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్.. తొలి ఓవర్‌ వేసిన షహీన్ బౌలింగ్‌లోనే సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షాదాబ్ ఖాన్ వేసిన  తొలి రెండు ఓవర్లలోనూ భారీ షాట్స్‌తో అలరించి షాహిద్ అఫ్రిది రికార్డును సమం చేశాడు. 


ఆసియా కప్‌లో (వన్డే ఫార్మాట్) అత్యధిక సిక్సర్ల రికార్డు : 


- షాహిద్ అఫ్రిది : 26 సిక్సర్లు, 21 ఇన్నింగ్స్ 
- రోహిత్ శర్మ : 26 సిక్సర్లు, 24 ఇన్నింగ్స్ 
- సనత్ జయసూర్య - 23 సిక్సర్లు, 24 ఇన్నింగ్స్ 
- సురేశ్ రైనా - 18 సిక్సర్లు, 13 ఇన్నింగ్స్ 
- మహ్మద్ నబీ - 13 సిక్సర్లు, 11 ఇన్నింగ్స్


 






ఈ మ్యాచ్‌లో రోహిత్ షహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లోనే సిక్సర్ కొట్టాడు. తద్వారా వన్డేలలో షహీన్ బౌలింగ్‌లో  మొదటి ఓవర్‌లోనే సిక్సర్ బాదిన తొలి బ్యాటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. 


నిన్న అర్థ సెంచరీ చేయడం ద్వారా  రోహిత్ ఆసియా కప్ చరిత్రలో  అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో (భారత్ తరఫున) సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.  ఈ జాబితాలో సచిన్ 9 అర్థ శతకాలు సాధించాడు.  ఆదివారం నాటి హాఫ్ సెంచరీ  రోహిత్‌కు  50వది కావడం గమనార్హం. 


ఆదివారం  భారత్ - పాక్ మధ్య  ఆట నిలిచిపోయే సమయానికి  భారత్ 24.1 ఓవర్లలో  రెండు వికెట్లు కోల్పోయి  147 పరుగులు చేసింది.  ఆట ముగిసేసమయానికి విరాట్ కోహ్లీ (16 బంతుల్లో  8 బ్యాటింగ్), కెఎల్ రాహుల్ (28 బంతుల్లో 17 బ్యాటింగ్)  క్రీజులో ఉన్నారు.  వర్షం వల్ల ఆట  సాగకపోయినా రిజర్వ్ డే అయిన నేడు.. నిన్న ఆట ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచే మొదలవుతుంది.










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial