Rohit Sharma: ఆసియా కప్ గెలిచిన ఆనందంలో రోహిత్ శర్మ తన వీక్‌నెస్‌ను మరోసారి బయటపెట్టుకున్నాడు. లంకపై ఏకపక్ష విజయం సాధించిన తర్వాత కొలంబో నుంచి ముంబై బయల్దేరేందుకు అక్కడ్నుంచి బయల్దేరిన హిట్‌మ్యాన్ ఎప్పటిలాగానే మతిమరుపుతో ఇబ్బందిపడ్డాడు. కొలంబోలోని హోటల్ రూమ్‌లోనే తన పాస్‌పోర్టును మరిచిపోయాడు. ఈ విషయాన్ని టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గతంలోనే వెల్లడించాడు.
2017లో విరాట్ కోహ్లీ ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ కపూర్ షో లో మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ మరిచిపోయినన్ని థింగ్స్ (వస్తువులు) ఎవరూ మరిచిపోయారు. ఒక్కటని కాదు.. ఐపాడ్, ఫోన్, వాలెట్ వంటివి చాలాసార్లు మరిచిపోయాడు. రెండు మూడు సార్లు అయితే హోటల్ రూమ్‌లోనే ఏకంగా పాస్‌పోర్ట్‌ను కూడా మరిచిపోయాడు. దానిని వెతికిపట్టుకోవడానికి మాకు తలప్రాణం తోకకు వచ్చింది. చిన్నచిన్న వస్తువులు, డైలీ యూజ్ చేసే వాటి గురించి రోహిత్ అస్సలు పట్టించుకోడు..’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. తాజాగా లంక నుంచి భారత్ తిరిగివస్తుండగా రోహిత్ తన పాస్‌పోర్టును మరిచిపోవడంతో కోహ్లీ వీడియో వైరల్ అయింది.
పాస్‌పోర్ట్ మరిచిపోయిన రోహిత్.. బస్ లోనే ఉండి వెంటనే హోటల్ గదిలోకి సపోర్ట్ స్టాఫ్‌ను పంపి దానిని తీసుకొచ్చుకున్నాడు. రోహిత్ వల్ల బస్ కూడా ఆపాల్సి వచ్చింది. రోహిత్ పాస్‌పోర్ట్ మరిచిపోయిన విషయాన్ని తెలిసిన భారత క్రికెటర్లు హిట్‌మ్యాన్‌ను ట్రోల్ చేశారు.
ఇక భారత్ - శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ తీసుకుంది. కానీ వారి నిర్ణయం తప్పని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ విశ్వరూపంతో లంక.. 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (27: 19 బంతుల్లో, ఆరు ఫోర్లు), ఇషాన్ కిషన్ (23: 18 బంతుల్లో, మూడు ఫోర్లు) వికెట్ పడనివ్వకుండానే టార్గెట్ ఫినిష్ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial