Mohammed Siraj: స్పిన్‌కు అనుకూలిస్తున్న కొలంబో పిచ్‌పై మరో థ్రిల్లర్ తప్పదని భావించిన భారత అభిమానులకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రదర్శన ఒకింత కోపమే తెప్పించింది. ఉన్నఫళంగా ఒక్క ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసి లంకను పూర్తిగా బంగాళఖాతంలో ముంచేసి అసలు పోటీ అనేదే లేకుండా మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా మార్చినందుకు సిరాజ్‌ను మెచ్చుకున్నవారికంటే ఇష్టంగా తిట్టుకున్నవారే ఎక్కువ. హాయిగా ఆదివారం ఫైనల్‌ను ఎంజాయ్ చేద్దామనుకుని టీవీల ముందు కూర్చున్న వారి ఆశలపై సిరాజ్ మియా నీళ్లు చల్లాడు. శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయ్యాక చాలామంది నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లూ, నటులు, దర్శకులు ట్వీట్స్ చేస్తూ సిరాజ్‌ను ఇష్టంగా తిట్టుకున్నారు. ఆ జాబితాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కూడా ఉన్నారు.
లంక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత శ్రద్ధా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో స్పందిస్తూ.. ‘అప్పుడే ఒక ఇన్నింగ్స్ ముగిసింది. ఇంత ఖాళీ టైమ్ మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలో సిరాజ్‌నే అడగండి’ అంటూ తన ఫోటోను షేర్ చేస్తూ రాసుకొచ్చింది. శ్రద్దా స్టేటస్ కొద్దిసేపట్లోనే నెట్టింట వైరల్ అయింది.
మా టోలిచౌకి కుర్రాడు..
సిరాజ్ అద్భుత ప్రదర్శన తర్వాత దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కూడా స్పందించాడు. ఎక్స్ (ట్విటర్) వేదికగా జక్కన్న స్పందిస్తూ.. ‘సిరాజ్ మియా.. మా టోలిచౌకి కుర్రాడు ఆసియా కప్ ఫైనల్‌లో ఆరు వికెట్లతో అదరగొట్టాడు. అంతేగాక తన బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి స్వయంగా తనే లాంగాన్ దిశగా పరిగెత్తి అందరి హృదయాలను గెలుచుకున్నాడు..’ అని ట్వీట్ చేశారు.
ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే ఫైనల్ పోరు ఆరంభమై ప్రేక్షకులందరూ ఇంకా సీట్లలో సరిగ్గా కూర్చోకముందే లంక ఇన్నింగ్స్ పనిపట్టాడు సిరాజ్.. తొలి ఓవర్‌లో బుమ్రా.. కుశాల్ పెరీరాను ఔట్ చేసి లంక పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఓవర్ సిరాజ్ మెయిడిన్ వేశాడు. నాలుగో ఓవర్లో లంక క్రికెట్ జట్టు తరాల పాటు భయపడే ఓవర్ వేశాడు సిరాజ్. ఆ ఓవర్లో తొలి బంతికే నిస్సంకను ఔట్ చేసిన మియా.. తర్వాతి రెండు బంతులకు సమరవిక్రమ, చరిత్ అసలంకలను పెవిలియన్‌కు పంపాడు. ఆరో బంతికి ధనంజయ డిసిల్వ కూడా అదే బాటలో వెళ్లాడు. సిరాజ్ తన మరుసటి ఓవర్లో నాలుగో బంతికి లంక సారథి శనకను బౌల్డ్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 12వ ఓవర్లో కుశాల్‌ను కూడా ఔట్ చేశాడు. మొత్తంగా నిన్నటి మ్యాచ్‌లో ఏడు ఓవర్లు వేసిన సిరాజ్ ఒక మెయిడిన్ చేసి 21 పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. అనంతరం లంక నిర్దేశించిన 51 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6.1 ఓవర్లలోనే ఛేదించి 8వ ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial