PAK vs NEP: 


ఆసియాకప్‌-2023లో మొదటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. పసికూనగా భావించిన నేపాల్‌ ఆతిథ్య పాకిస్థాన్‌కు గట్టిపోటీనిస్తోంది. చక్కని బౌలింగ్‌తో ప్రపంచ నంబర్‌ జట్టును ఇబ్బంది పెడుతోంది. దాంతో 30 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ (61; 79 బంతుల్లో 6x4) హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు. ఇఫ్తికార్‌ అహ్మద్ (7; 11 బంతుల్లో 1x4) అతడికి తోడుగా ఉన్నాడు. కరన్‌ కేసీ, సందీప్‌ లామిచాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.


ముల్తాన్‌ వేదికగా జరుగుతున్న మ్యాచులో మొదట పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బ్యాటర్లకు అనులిస్తున్నా మందకొడిగా ఉంది. దాంతో బాబర్‌ ఆజామ్‌ సేనకు శుభారంభం దక్కలేదు. 25 పరుగులే 2 వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోరు 21 వద్దే ఓపెనర్ ఫకర్‌ జమాన్‌ (14) ఔటయ్యాడు. కరన్‌ బౌలింగ్‌లో అసిఫ్ షేక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మరో 4 పరుగులకే ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (5) రనౌట్‌ అయ్యాడు.


ఈ పరిస్థితుల్లో కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ (44; 50 బంతుల్లో 6x4) క్రీజులో నిలబడ్డారు. ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తూనే చక్కని బంతుల్ని డిఫెండ్‌ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 106 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో పాకిస్థాన్‌ 21.2 ఓవర్లకు 100 పరుగుల మైలురాయి అందుకుంది. జోరు పెంచే క్రమంలో.. హాఫ్‌ సెంచరీకి ముందు రిజ్వాన్‌ రనౌట్‌ అయ్యాడు. 23.4వ బంతికి అతడు పరుగు తీస్తుండగానే అయిరీ నేరుగా నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో అద్భుతమై త్రో విసిరాడు. వికెట్లు ఎగిరిపోవడంతో రిజ్వాన్‌ పెవిలియన్‌కు చేరక తప్పలేదు.


బాబర్‌ ఆజామ్‌ మాత్రం జోరు కొనసాగిస్తున్నాడు. 72 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. జట్టుకు భారీ స్కోరు అందించే బాధ్యతను తీసుకున్నాడు. జట్టు స్కోరు 124 వద్ద ఆఘా సల్మాన్‌ (5; 14 బంతుల్లో) ఔటైనప్పటికీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతడిలాగే ఆడితే నేపాల్‌ భారీ స్కోరు ఛేదించాల్సి వస్తుంది. కాగా ఆసియాకప్‌ చరిత్రలో ఆ జట్టు ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.


పిచ్‌ రిపోర్టు: ముల్తాన్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. వికెట్‌ను చక్కగా రోలింగ్‌ చేశారు. బంతి చక్కగా బ్యాటు మీదకు వస్తుంది. బౌన్స్‌ను బట్టి స్పిన్నర్లు లెంగ్తులను సవరించుకోవాల్సి వస్తుంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురు కింద బంతి స్వింగ్‌ అవ్వొచ్చు. మొత్తానికి వికెట్‌ బాగుంటుంది.


నేపాల్‌: కుశాల్ భూర్తెల్‌, ఆసిఫ్ షేక్, రోహిత్‌ పౌడె, ఆరిఫ్ షేక్‌, కుశాల్‌ మల్లా, దీపేంద్ర సింగ్‌, గుల్షన్ ఝా, సోంపాల్‌ కామి, కరణ్ కేసీ, సందీప్‌ లామిచాన్‌, లలిత్‌ రాజ్‌బన్షీ


పాకిస్థాన్‌: ఫకర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హఖ్‌, బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, అఘా సల్మాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, షాహీన్ అఫ్రిది, నసీమ్‌ షా, హ్యారిస్‌ రౌఫ్‌


బాబర్‌ ఆజామ్‌: మేం మొదట బ్యాటింగ్‌ చేస్తాం. పిచ్‌ మందకొడిగా కనిపిస్తోంది. మెరుస్తోంది. ముందే తుది జట్టును ప్రకటించాల్సిన కారణమేమీ లేదు. మా జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలని అనుకుంటున్నాం. వన్డేల్లో నంబర్‌ వన్‌ జట్టుగా ఉండటమూ ఒక రకమైన ఆనందకరమైన ప్రెజరే. ఏదేమైనా మేం ఆటను ఆస్వాదిస్తాం. అత్యుత్తమ ఆటతీరును బయటపెడతాం.


రోహిత్‌ పౌడెల్‌: మేమంతా ఆనందంగా ఉన్నాం. ఆసియాకప్‌లో ఇది మా మొదటి మ్యాచ్‌. నేపాల్‌లో ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు నేపాల్‌ తరహాలోనే ఉన్నాయి. వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది.