Asia Cup 2023: ఆసియా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బుధవారం ముల్తాన్ వేదికగా ఆతిథ్య పాకిస్తాన్.. నేపాల్‌ను ఢీకొనబోతుంది. ఈ టోర్నీ షెడ్యూల్ ప్రకటనకు ముందు జరిగిన డ్రామా అంతా ఇంతా కాదు. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌కు తాము రాబోమని బీసీసీఐ కుండబద్దలు కొట్టడం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లోని మిగిలిన సభ్య దేశాలు కూడా పాక్‌కు వెళ్లేందుకు నిరాసక్తగా ఉండటంతో అసలు ఈ టోర్నీ జరుగుతుందా..? లేదా..? అన్న అనుమానం ఉండేది. కానీ అడ్డంకులను అధిగమించి మొదలుకాబోయే ఆసియా కప్ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
1984లో మొదలు..
ప్రపంచ క్రికెట్‌లో వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌లో అంత ప్రాధాన్యం పొందిన టోర్నీ ఆసియా కప్. ఆసియా ఖండపు దేశాల ఐక్యతే ధ్యేయంగా వచ్చిన ఈ టోర్నీ 1984లోనే ప్రారంభమైంది. ఆ ఏడాది మూడు దేశాలు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక) మాత్రమే టోర్నీలో పాల్గొన్నాయి. షార్జా (యూఏఈ) వేదికగా జరిగిన తొలి టోర్నీలో విజేత భారత్.
1986లోనే బాయ్‌కాట్..
ప్రస్తుత ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌కు వెళ్లమని భీష్మించుకున్న భారత్.. తటస్థ వేదికలమీద ఆడతానని తెలిపి చివరికి శ్రీలంకలో ఆడేందుకు ఒప్పుకున్నది. ఈ ట్రెండ్ ఇప్పుడే వచ్చింది కాదు. గతంలో కూడా భారత్ , పాకిస్తాన్‌లు ఈ టోర్నీని బహిష్కరించాయి. శ్రీలంక వేదికగా జరిగిన 1986 ఆసియా కప్‌ను భారత్ బహిష్కరించింది. శ్రీలంకతో సంబంధాలు బాగోలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ ఆడలేదు. దీంతో నిర్వాహకులు భారత్ స్థానంలో బంగ్లాదేశ్ (ఈ ఏడాదే ఎంట్రీ)ను ఆడించారు. ఇక 1990లో ఆసియా కప్‌ను భారత్‌లో నిర్వహించగా.. ఇండియాతో సరిహద్దు, రాజకీయ వివాదాల కారణంతో పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంది.
అన్ని ఫార్మాట్లు..
తొలి ఏడాది ఆసియా కప్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరిగింది. మూడింట రెండు గెలిచిన భారత్.. విజేతగా నిలిచింది. 2004 నుంచి ఆసియా కప్‌ను టోర్నమెంట్ ఫార్మాట్ (గ్రూప్ స్టేజ్, సూపర్ 4, ఫైనల్) లోకి మార్చారు. ఇక 2016 వరకూ వన్డే ఫార్మాట్ లోనే నిర్వహించిన ఆసియా కప్‌ను ఆ ఏడాది నుంచి టీ20 ఫార్మాట్ లో కూడా ఆడిస్తున్నారు. 2015లో ఐసీసీ.. ఆసియా కప్ మ్యాచ్‌లకు అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. 2016 నుంచి ఆసియా కప్.. ప్రతి రెండేండ్లకోసారి వన్డే ప్రపంచకప్ ఉంటే వన్డే ఫార్మాట్‌లో టీ20 వరల్డ్ కప్ ఉంటే పొట్టి ఫార్మాట్‌లో జరుగుతోంది. చివరగా వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ 2018లో (2019 వన్డే వరల్డ్ కప్) జరిగింది. ఆ ఏడాది భారత్ విజేతగా నిలిచింది. 2020లో కూడా ఆసియా కప్ జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. గతేడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో యూఏఈలో ఆసియా కప్ పొట్టి ఫార్మాట్‌లో జరుగగా టోర్నీ విజేతగా శ్రీలంక నిలిచింది.
తొలి ఐదు వికెట్ల వీరుడు మనోడే..
సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ టోర్నీలో తొలిసారి ఐదు వికెట్లు తీసిన ఘనత భారత్‌కు చెందిన స్పిన్నర్ అర్షద్ అయూబ్ పేరు మీద ఉంది. ఢాకా (బంగ్లాదేశ్) వేదికగా 1998లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్షద్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆశ్చర్యకరంగా మరే భారత బౌలర్ కూడా ఆసియా కప్‌లో ఐదు వికెట్ల ఘనత నమోదు చేయలేదు. గతేడాది టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అఫ్గానిస్తాన్ పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. కానీ అది టీ20 ఫార్మాట్.
భారత్‌కు ‘ఎక్స్‌ట్రా’ రికార్డు..
ఆసియా కప్‌లో భారత్ కోరుకోని రికార్డు ఒకటి ఉంది. ఒక మ్యాచ్‌లో అత్యధికంగా ఎక్స్‌ట్రాలు సమర్పించిన జట్టు టీమిండియానే. 2000, 2004 ఆసియా కప్‌లలో పాకిస్తాన్‌పై ఒక మ్యాచ్‌లో అదనపు పరుగుల రూపంగా 38 రన్స్ సమర్పించుకున్నారు. ఈ రెండు సందర్భాలలో భారత్.. 44, 59 పరుగుల తేడాతో ఓడింది.
ఒకే ఒక్క టై..
39 ఏండ్ల ఆసియా కప్ చరిత్రలో ఒకటే ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అది కూడా భారత్ మ్యాచే కావడం గమనార్హం. 2018లో భారత్ - అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. నాటి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస 252 పరుగులు చేయగా.. భారత్ కూడా 49.5 ఓవర్లలో 252 పరుగులే చేసి ఆలౌట్ అయింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial