Kuldeep Yadav: పాకిస్తాన్‌తో  సోమవారం ముగిసిన  హై ఓల్టేజ్ పోరులో  భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దాయాది కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.  పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పాకిస్తాన్.. ఛేదనలో బోల్తా కొట్టింది. దీనికి ప్రధాన కారణం  కుల్దీప్ యాదవ్. ఈ చైనామన్ స్పిన్నర్ ఎంట్రీ ఇచ్చేదాకా పాకిస్తాన్ కనీసం  150 - 200 అయినా చేయకపోతదా..? అనే ఆశతో ఉన్న ఆ జట్టు అభిమానులకు కుల్దీప్  కోలుకోలేని షాకిచ్చాడు.  ఐదు వికెట్లు పడగొట్టి పాక్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. ఈ  క్రమంలో అతడు పలు రికార్డులు కూడా నమోదుచేశాడు. 


నిన్నటి మ్యాచ్‌లో కుల్దీప్.. 8 ఓవర్లు బౌలింగ్ చేసి  25 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా  పాకిస్తాన్‌పై అత్యుత్తమ  ప్రదర్శన చేసిన తొలి భారతీయ లెఫ్టార్మ్ పేసర్‌గా రికార్డులకెక్కాడు.  అంతకుముందు భారత్ నుంచి ఒక్క లెఫ్టార్మ్ బౌలర్  ఒక్కరు కూడా ఐదు వికెట్ల ఘనతను అందుకోలేదు. అందరూ నాలుగు వికెట్ల వద్దే ఆగిపోయారు.  గతంలో మనీందర్ సింగ్ (9 ఓవర్లు.. 22 పరుగుల..  4 వికెట్లు), రవిశాస్త్రి (10 ఓవర్లు.. 38 పరుగులు.. 4 వికెట్లు) ఆర్పీ సింగ్ (10-40-4) ఆశిష్ నెహ్రా (10-55-4) లు ఫైఫర్ కలను నిజం చేసుకోలేకపోయారు.   కానీ కుల్దీప్ మాత్రం ఈ ఘనతను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు.


 






ఇక ఆసియా కప్‌లో  తొలిసారి ఫైఫర్ తీసిన బౌలర్  కూడా భారత స్పిన్నరే కావడం గమనార్హం. హైదరాబాద్ స్పిన్నర్ అర్షద్ అయూబ్.. 1988 ఆసియా కప్‌లో పాక్‌పై  ఐదు వికెట్లు పడగొట్టాడు.  అర్షద్ అయూబ్ తర్వాత  సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వెంకటేశ్ ప్రసాద్‌లు  కూడా పాక్‌పై ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కుల్దీప్ కూడా నిలిచాడు. 


 






కాగా పాకిస్తాన్‌పై భారత్‌కు వన్డేలలో ఇది రెండో అత్యుత్తమ స్కోరు. 2005లో  విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కూడా  భారత్ సరిగ్గా 356 పరుగులే చేసింది. ఆసియా కప్‌లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. పరుగుల పరంగా పాకిస్తాన్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద (228 పరుగుల తేడా) విజయం. పాకిస్తాన్‌కు పరుగుల పరంగా ఇది రెండో అతి పెద్ద ఓటమి.  అంతకుముందు ఆ జట్టు 2009లో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో 234 పరుగుల తేడాతో ఓడింది. వన్డేలలో  పరుగులపరంగా భారత్‌కు ఇది నాలుగో అతిపెద్ద విజయం. అంతకుముందు  శ్రీలంక (317), బెర్ముడా (257), హాంకాంగ్ (256)లపై విజయాలున్నాయి. 









ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial