Asia Cup, IND Vs PAK: ‘నెత్తురుకు మరిగిన అగ్ని చీతా.. శత్రువును ఎంచితే మొదలు వేట.. చూపు గాని విసిరితే ఓరకంట.. డెత్ కోటా.. కన్ఫమ్ అంట’ అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. పవన్ రీల్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అయితే టీమిండియా బ్యాటింగ్ మ్యాస్ట్రో విరాట్ కోహ్లీ మాత్రం క్రికెట్‌లో తనను మించిన రియల్ ఓజీ ఎవడూ లేడని మరోసారి నిరూపించాడు. భారత్ - పాక్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో మీమర్స్ ఈ ఓజీ యాంథమ్‌ను కోహ్లీకి అన్వయించి విసిరిన రీల్స్, పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాక్‌తో పోరులో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయానికి బాటలు వేసిన రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించాడు. మరి ది రియల్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) పాక్‌తో పోరులో నెలకొల్పిన రికార్డులు ఇక్కడ చూద్దాం.
కోహ్లీ @ 13వేలు
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు 98 పరుగులు చేస్తే వన్డేలలో 13 వేల పరుగులు పూర్తిచేసిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం కోహ్లీకి దక్కింది. ఈ మ్యాచ్‌లో అతడు దానిని పూర్తిచేయడమే గాక మరిన్ని రికార్డులను నెలకొల్పాడు.
- వన్డేలలో అత్యంత వేగంగా 13వేల పరుగుల క్లబ్‌లో చేరిన తొలి ఆటగాడు కోహ్లీ. ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో 267 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 321 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (341), కుమార సంగక్కర (363), సనత్ జయసూర్య (416)ల రికార్డులను కోహ్లీ బ్రేక్ చేశాడు.
- కోహ్లీకి వన్డేలలో ఇది 47వ సెంచరీ. మరో రెండు సెంచరీలు చేస్తే అతడు సచిన్ రికార్డు (49)ను సమం చేస్తాడు. 47వ శతకం చేయడానికి సచిన్ 435 ఇన్నింగ్స్‌లు ఆడితే కోహ్లీ వాటిని 267 ఇన్నింగ్స్‌లలోనే అందుకున్నాడు. మొత్తంగా కోహ్లీకి ఇది 77వ వన్డే శతకం.
- వన్డేలలో అత్యంత వేగంగా 8 వేలు, 9 వేలు, 10 వేలు, 11 వేలు, 12 వేలు, 13 వేల పరుగులు పూర్తిచేసుకున్న తొలి క్రికెటర్ కోహ్లీనే.
- ఆసియా కప్‌లో కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సనత్ జయసూర్య (6) తర్వాతి స్థానం కోహ్లీదే. జయసూర్య 24 ఇన్నింగ్స్‌లలో 6 సెంచరీలు చేస్తే కోహ్లీ 12 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. కుమార సంగక్కర.. 23 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు సాధించాడు.
- కోహ్లీ సెంచరీ చేసినప్పుడు భారత్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య 53. ఈ జాబితాలో కోహ్లీ.. సచిన్ (53) రికార్డును సమం చేశాడు. రికీ పాంటింగ్ (55) ముందువరుసలో ఉన్నాడు.
- ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై మూడు సెంచరీలు చేసిన కోహ్లీ.. మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (పీవోటీఎం) అవార్డులు గెలుచుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కోహ్లీనే.. మొత్తంగా వన్డేలలో కోహ్లీకి ఇది 39వ పీవోటీఎం. ఓవరాల్‌గా కోహ్లీకి ఇది 60వ అవార్డు. ఈ జాబితాలో సచిన్ (61) ఒక్కడే కోహ్లీ కంటే ముందున్నాడు.
- ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ ఏకంగా 233 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆసియా కప్‌తో పాటు వన్డేలలో పాకిస్తాన్‌పై భారత్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గతంలో హఫీజ్ - నాసిర్ (224) రికార్డును ఈ ధ్వయం బ్రేక్ చేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial