వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వన్‌సైడెడ్‌గా ముగిసింది. ఏకంగా 228 పరుగులతో భారత్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం పాకిస్తాన్ 32 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయింది. నిజానికి పాకిస్తాన్ ఎనిమిది వికెట్లే కోల్పోయింది. కానీ హరీస్ రౌఫ్, నసీం షా బ్యాటింగ్‌కు రాలేకపోయారు. దీంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ అక్కడే ముగిసింది.
భారత్ తరఫున విరాట్ కోహ్లీ (122 నాటౌట్: 94 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు), కేఎల్ రాహుల్ (111 నాటౌట్: 106 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీలతో నిలిచారు. పాకిస్తాన్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ షో...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే వికెట్లు తీసి శుభారంభాన్నిచ్చే పాకిస్తాన్ పేస్ దళం పప్పులు ఈ మ్యాచ్‌లో ఉడకలేదు. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (58: 52 బంతుల్లో, 10 ఫోర్లు), రోహిత్ శర్మ (56: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) పాక్ బౌలర్లపై విరుచుకుపడే పనిలో పడ్డారు. మొదటి 10 ఓవర్లలో పాక్ బౌలర్లను బాదే బాధ్యతను గిల్ తీసుకున్నాడు.
షహీన్ షా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్, ఐదో ఓవర్లలో శుభ్‌మన్ గిల్ మూడేసి బౌండరీలు కొట్టాడు. దీంతో స్కోరు పరుగులు పెట్టింది. కానీ మరో ఎండ్‌లో నసీం షా కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తన మొదటి మూడు ఓవర్లలో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ అతని తర్వాతి రెండు ఓవర్లలో గిల్ 17 పరుగులు రాబట్టాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా భారత్ 61 పరుగులు చేసింది.
స్పిన్నర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌కు వచ్చాక స్టీరింగ్ రోహిత్ చేతిలోకి వెళ్లింది. షాదాబ్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో గిల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 37 బంతుల్లోనే గిల్ 50 కొట్టడం విశేషం. ఇదే ఓవర్లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఇక షాదాబ్ ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో రోహిత్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 42 బంతుల్లోనే రోహిత్ 50 కొట్టాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారత్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు రోహిత్, గిల్ వరుస ఓవర్లలో అవుటయ్యారు.
వరుస ఓవర్లలో ఓపెనర్లు ఔటైనప్పటికీ టీమ్ ఇండియా ఎక్కడా తడబడలేదు. కేఎల్ రాహుల్ (111 నాటౌట్: 106 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు) క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. శస్త్రచికిత్స తర్వాత చాన్నాళ్లకు క్రీజులో అడుగు పెట్టిన అతడు సొగసైన షాట్లతో మురిపించాడు. కోహ్లీ (122 నాటౌట్: 94 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) నెమ్మదిగా ఆడుతున్న తరుణంలో చక్కని బంతుల్ని అతడు బౌండరీకి తరలించాడు. తనదైన రీతిలో మంచి ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకున్నాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మరోవైపు కింగ్ డబుల్స్, సింగిల్స్‌తో అతడికి స్ట్రైక్ ఇచ్చాడు. దాంతో 38 ఓవర్లకు భారత్ 250కి చేరువైంది. మరికాసేపటికే విరాట్ 55 బంతుల్లో అర్ధశతకం బాదేశాడు. ఆఖరి పది ఓవర్లలో వీరిద్దరూ ఆడిన తీరు అమేజింగ్. ఈ దశలో రాహుల్ నెమ్మదించగా కోహ్లీ వేగం పెంచాడు. ఇదే క్రమంలో 84 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. మరోవైపు రాహుల్ 100 బంతుల్లో సాధించాడు. ఈ జోడీ 194 బంతుల్లో 233 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 356 స్కోర్ చేసింది.
అదరగొట్టిన కుల్దీప్
పాకిస్తాన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఫామ్‌లో ఉన్న ఇమామ్ ఉల్ హక్‌ను (9: 18 బంతుల్లో, ఒక ఫోర్) ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే జస్‌ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. బాబర్ ఆజంను (10: 24 బంతుల్లో, రెండు ఫోర్లు) హార్దిక్ పాండ్యా, మహ్మద్ రిజ్వాన్‌ను (2: 5 బంతుల్లో) శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ షో మొదలైంది. అక్కడి నుంచి ఐదు పాకిస్తాన్ వికెట్లను కుల్దీప్ యాదవే పడగొట్టాడు. దీంతో పాకిస్తాన్ 128 పరుగులకే ఆలౌట్ అయింది.