Asia Cup 2023, IND vs SL: ఆసియా కప్ - 2023లో   ఆడిన మూడో మ్యాచ్‌లో భారత అసలు ఆట బయటకొచ్చింది. వర్షం కారణంగా పాకిస్తాన్‌తో రెండ్రోజులపాటు జరిగిన  సూపర్ - 4  మ్యాచ్‌లో టీమిండియా ఏకపక్ష  విజయం సాధించింది. పాక్‌ పనిపట్టిన భారత్   నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధం చేసుకుంది. రెండువారాలుగా శ్రీలంకలోనే ఆడుతున్నా ఇంతవరకూ ఆసియా కప్  కోహోస్ట్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడని  భారత్..  మంగళవారం లంకేయులతో కీలకపోరులో తలపడనుంది. వరుసగా 13 విజయాలు గెలిచి  జోరుమీదున్న శ్రీలంక.. భారత జోరును అడ్డుకుంటుందా..? రెండు రోజులుగా ఆడిన భారత జట్టు.. 15 గంటల వ్యవధిలోనే మ్యాచ్ ఆడనుండటం గమనార్హం. 


లంకకు తొలి పరీక్ష 


ప్రధాన పేసర్లు లేకున్నా  గ్రూప్ స్టేజ్‌తో పాటు  సూపర్  - 4లో బంగ్లాదేశ్‌పై నెగ్గిన  శ్రీలంకకు నేడు ఆసియా కప్‌లో అసలైన పరీక్ష ఎదురుకానుంది.  గత మూడు  మ్యాచ్‌లలో ఆ జట్టు  అఫ్గానిస్తాన్‌తో ఒకటి, బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడింది.   ఆ జట్టు కీలక బౌలర్లు దుష్మంత చమీర, వనిందు హసరంగ, దిల్షాన్ మధుశంక, లాహిరు కుమారలు  లేకున్నా గత మూడు మ్యాచ్‌లలో  ఉన్న బౌలర్లతోనే నెగ్గుకొచ్చిన లంకకు  భారత బ్యాటర్ల నుంచి అసలైన సవాల్ ఎదురొవచ్చు.  పేసర్లలో కసున్ రజిత ఒక్కడే  అనుభవజ్ఞుడు.  పతిరాన  మీద ఆ జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. కెప్టెన్ శనక,  స్పిన్నర్ మహీశ్ తీక్షణ,  ధనంజయ డిసిల్వలు  భారత బ్యాటర్లను ఏ మేరకు అడ్డుకుంటారో మరి.. 


ఇక బ్యాటింగ్‌లో ఆ జట్టు  కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక , సమరవిక్రమల  మీద భారీగా ఆధారపడుతోంది. గత మూడు మ్యాచ్‌లలో కూడా లంక  బ్యాటింగ్‌కు వీళ్లే అండగా నిలిచారు.   అసలంక, డిసిల్వ, శనకలు విజృంభిస్తే భారత్‌కు తిప్పలు తప్పవు. 


భారత్‌కూ కీలకమే.. 


పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్న భారత జట్టు లంకను ఈజీగా తీసుకుంటే పప్పులో కాలేసినట్టే.  ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తున్న ఆ జట్టుకు స్వదేశంలో ఆడుతుండటం  కలిసొచ్చే అంశం.  పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్,  విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌లు రాణించడం  భారత్‌కు సానుకూలాంశం. వరల్డ్ కప్ ముందు టాప్-4 బ్యాటర్లు ఇదే ఫామ్‌ను కొనసాగించాలని భారత్ కోరుకుంటోంది. పాకిస్తాన్‌తో  ఆడించిన జట్టునే భారత్ బరిలోకి దించే అవకాశాలున్నాయి.  ఒకవేళ శ్రేయాస్ కోలుకుంటే ఇషాన్ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. కుల్దీప్ మాయ  భారత్‌కు ఘన విజయాన్ని అందించింది. అయితే 15 గంటల వ్యవధిలోనే  రెండో మ్యాచ్ ఆడుతుండటంతో భారత్ ఒకట్రెండు మార్పులు చేసే అవకాశాలు లేకపోలేదు. 


సూపర్ - 4 లో టాప్-2లో ఉన్న జట్లు  ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.  ఇదివరకే లంక, భారత్‌లు తలా ఓ విజయం సాధించాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు  ఫైనల్ రేసులో ముందుంటుంది.  దీంతో ఇరు జట్లూ నేటి మ్యాచ్‌ను కీలకంగా భావిస్తున్నాయి. 


వర్షం ముప్పు.. 


నేటి మ్యాచ్‌కు కూడా వాన ముప్పు ఉంది. వాతవరణ సంస్థల నివేదికల ప్రకారం.. మంగళవారం  కొలంబోలో వర్షం కురిసే అవకాశం 84 శాతం ఉంది. అయితే  మ్యాచ్ ప్రారంభమై సాగుతున్న కొద్దీ వర్షం కురిసే అవకాశాలు తగ్గుతూ ఉండటం శుభపరిణామమే. భారత్ - పాక్ మ్యాచ్ మాదిరిగా నేటి మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. 


తుది జట్లు  (అంచనా) : 


శ్రీలంక : పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, దునిత్ వెల్లలగె, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, మతీశ పతిరాన 


భారత్ :  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్/శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర  జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా 


మ్యాచ్ వెన్యూ, టైమింగ్స్ : 


- కొలంబోలోని  ప్రేమదాస స్టేడియం వేదికగా  నేటి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం  మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 


- ఈ  మ్యాచ్‌ను స్టార్ నెట్‌వర్క్‌లో  హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు తెలుగులో కూడా  వీక్షించొచ్చు.  మొబైల్స్‌లో అయితే ఎలాంటి రుసుము లేకుండానే డిస్నీ హాట్‌స్టార్‌ యాప్‌లో చూసేయొచ్చు. 







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial