India vs Pakistan: ఆగస్ట్ 30వ తేదీ నుంచి అంటే ఇవాళ్టి నుంచే ఏషియా కప్ స్టార్ట్ కాబోతోంది. పాకిస్థాన్-నేపాల్ మధ్య ఇవాళ ముల్తాన్ లో మ్యాచ్ తో ఏషియా కప్ స్టార్ట్ అవబోతోంది. మన కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ప్రపంచకప్ కు ఈ టోర్నమెంట్ ను ప్రాక్టీస్ గా అన్ని జట్లూ భావిస్తున్నాయి. మరోవైపు నేపాల్ మాత్రం పెద్ద జట్లతో మ్యాచులు ఆడి కిటుకులు, మెళకువలు నేర్చుకుని మరింత ఎదగాలనే పట్టుదలతో ఉంటుందనడం ఖాయం. అయితే ఏషియా కప్ ఫార్మాట్ ఏంటి? పాకిస్థాన్ ను ఓడించినా సరే మనం టాప్ ప్లేస్ కు ఎందుకు వెళ్లలేమో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


ఏషియా కప్ లో పాల్గొనే మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టారు. గ్రూప్-ఏ, గ్రూప్-బీ. మొదటగా లీగ్ స్టేజ్ జరుగుతుంది. ఈ దశలో ప్రతి జట్టూ తన గ్రూప్ లోని మిగతా రెండు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. అంటే ఏషియా కప్ లీగ్ దశలో మొత్తం మీద ఆరు మ్యాచులు. 


ఈ దశ ముగిసేసరికి గ్రూప్ ఏ మరియు గ్రూప్ బీలో టాప్-2లో ఉన్న నాలుగు జట్లు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తాయి. వాటికి ఏ1, ఏ2, బీ1, బీ2 అని ట్యాగ్స్ ఇస్తారు. ఇలా సూపర్ ఫోర్ చేరిన నాలుగు జట్లూ ప్రతి జట్టుతోనూ తలో మ్యాచ్ ఆడుతుంది. అంటే ఆ లెక్కన చూసుకుంటే సూపర్-4 దశలో కూడా మొత్తం మీద ఆరు మ్యాచులు జరుగుతాయి. సూపర్ ఫోర్ ముగిసేసరికి టాప్-2 లో ఉన్న జట్ల మధ్య సెప్టెంబర్ 17వ తేదీన ఫైనల్ జరుగుతుంది.


అయితే సూపర్ ఫోర్ దశలో చిన్న మెలిక ఉంది. ఒకవేళ గ్రూప్-ఏలో ఇండియా టాపర్ గా నిలిచినా సరే... అంటే పాకిస్థాన్ తో, నేపాల్ తో జరగబోయే మ్యాచెస్ గెలిచినా సరే ఏ1గా నిలవదు. ఏ2 ట్యాగ్ తోనే సూపర్ ఫోర్ కు వెళ్తుంది. ఎందుకంటే ఏ1గా నిలిస్తే సూపర్ ఫోర్ లో ఓ మ్యాచ్ పాకిస్తాన్ లో ఆడాల్సి ఉంటుంది కాబట్టి. ఇరుదేశాల మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా మన జట్టు ఇప్పుడు ఆ దేశంలో పర్యటించట్లేదు కాబట్టి.



అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా ఇండియా, పాకిస్థాన్ ఇరుజట్లూ సూపర్ ఫోర్ కు క్వాలిఫై అయితే పాకిస్థాన్ ఏ-1గా, భారత్ ఏ-2గా తమ సూపర్ ఫోర్ మ్యాచెస్ ఆడతాయి. ఒకవేళ ఈ రెండు జట్లలో ఏదైనా క్వాలిఫై అవకుండా నేపాల్ క్వాలిఫై అయితే ఆ ట్యాగ్ నేపాల్ జట్టుకు అప్లై అవుతుంది. అంటే ఉదాహరణకు పాకిస్థాన్ క్వాలిఫై అవకుండా నేపాల్ సూపర్-4 కు వెళ్లిందనుకోండి. సూపర్-4 మ్యాచెస్ లో నేపాల్ ఏ-1గా ఉంటుందన్నమాట.

ఇదే మాదిరిగా గ్రూప్-బీలో కూడా ముందుగానే ర్యాంకింగ్స్ ఇచ్చారు. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్-4 కు క్వాలిఫై అయ్యాయి అనుకోండి. ఫలితాలతో సంబంధం లేకుండా శ్రీలంక బీ-1గా, బంగ్లాదేశ్ బీ-2గా తమ సూపర్ ఫోర్ మ్యాచెస్ ఆడతాయి. ఒకవేళ ఈ రెండు జట్లలో ఏదైనా సరే క్వాలిఫై అవకుండా అఫ్గానిస్థాన్ క్వాలిఫై అయితే ఆ సంబంధిత ట్యాగ్ అఫ్గాన్ కు అప్లై అవుతుంది. తదనుగుణ షెడ్యూల్ ప్రకారం అఫ్గాన్ తమ మ్యాచెస్ ఆడుతుంది.