Asia Cup 2023: నేటి నుంచి ముల్తాన్ (పాకిస్తాన్) వేదికగా మొదలుకాబోయే  ఆసియా కప్  - 2023లో  గురువారం (ఆగస్టు 31) తొలి మ్యాచ్ ఆడనున్న బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది.  ఆ జట్టు స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ లిటన్ దాస్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.  నిన్నట్నుంచి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న  లిటన్ దాస్.. టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. 


రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన దాస్ బంగ్లాదేశ్ జట్టులో కీలకంగా ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో టాపార్డర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ కూడా వెన్ను గాయం కారణంగా తప్పుకోవడంతో  దాస్ మీద  ఎక్కువ బాధ్యత ఉండేది.  కానీ ఇప్పుడు అతడు కూడా దూరం కావడం బంగ్లాదేశ్‌కు భారీ  ఎదురుదెబ్బే.. 2022లో దాస్.. బంగ్లాదేశ్ తరఫున 25 ఇన్నింగ్స్‌లలో 875 పరుగులు చేసి ఆ జట్టు తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు.  ఈ క్రమంలో అతడు ఏడు అర్థ  సెంచరీలు, ఓ సెంచరీ కూడా నమోదుచేశాడు. 


 






రిప్లేస్‌మెంట్‌గా అనముల్.. 


దాస్ స్థానాన్ని  బంగ్లాదేశ్  క్రికెట్ బోర్డు (బీసీబీ) భర్తీ చేసింది. 30 ఏండ్ల  అనముల్ హక్ బిజోయ్‌ను జట్టులో చేర్చింది.  అనముల్..  ఓపెనర్‌గా రావడమే గాక వికెట్ కీపర్ గానూ సేవలందిస్తాడు. ఇప్పటివరకూ 44 వన్డేలు ఆడిన అనముల్.. 1,254 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి సగటు 30.58గా నమోదైంది. వన్డేలలో అనముల్.. మూడు సెంచరీలు, ఐదు అర్థ సెంచరీలు కూడా సాధించాడు. అయితే బంగ్లా తుది జట్టులో అనముల్‌కు చోటు దక్కుతుందా..? లేదా..? అన్నది అనుమానమే. బంగ్లా జట్టులో ఇప్పటికే ముష్ఫీకర్ రహీమ్ రూపంలో  వికెట్ కీపర్ ఉన్నాడు. 
 
ఇక ఆసియా కప్ ఆడేందుకు ఈనెల 27నే శ్రీలంకకు చేరుకున్న బంగ్లాదేశ్.. తమ తొలి మ్యాచ్‌ను రేపు (గురువారం)  శ్రీలంకతో ఆడనుంది. పల్లెకె వేదికగా  జరుగబోయే మ్యాచ్‌తో ఆ జట్టు ఆసియా కప్ వేటను మొదలుపెట్టనుంది.  సెప్టెంబర్ 3న బంగ్లా.. లాహోర్‌లో అఫ్గానిస్తాన్‌తో తమ రెండో గ్రూప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. గతంలో ఆసియా కప్‌లో ఒకసారి ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్.. ఇప్పుడు ఎలాంటి సంచలనాలు నమోదుచేస్తుందో చూడాలి. 


 






ఆసియా కప్‌కు ‌‌బంగ్లాదేశ్ జట్టు : షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అనముల్ హక్, తాంజిద్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహీద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నస్ మహ్మద్, హసన్ మహమూద్, హసన్ మహమూద్ హుస్సేన్, అఫీఫ్ హుస్సేన్, షోర్ఫుల్ ఇస్లాం, అబాదోత్ హుస్సేన్, నయీమ్ షేక్
















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial