Asia Cup 2023 Final:  ఎన్నో అడ్డంకులు మరెన్నో అవంతరాలను దాటి మూడు వారాల క్రితం మొదలైన  ఆసియా కప్ - 2‌023 తుది అంకానికి  చేరింది.  ఆరు దేశాలు పాల్గొన్న ఈ   టోర్నీలో  భారత్, శ్రీలంకలు తుది పోరుకు అర్హత సాధించాయి.  ఆదివారం (సెప్టెంబర్ 17న) భారత్ - శ్రీలంక మధ్య కొలంబోలోని  ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగనుంది.  ఆసియా కప్ ఫైనల్‌‌లో ఇరు జట్లు గతంలో పలుమార్లు తుది పోరులో తలపడ్డాయి.  ఆ రికార్డులు,  విజేతల వివరాల గురించి ఇక్కడ చూద్దాం. 


1984లో మొదలైన ఆసియా కప్ (అప్పుడు  మూడు దేశాలు - భారత్, పాకిస్తాన్, శ్రీలంక)   ఆ తర్వాత ఆరు దేశాలు ఆడే  టోర్నీగా మారింది. ఆసియా కప్ ఫైనల్‌లో ఇరు జట్లూ  ఏడు సార్లు తలపడ్డాయి.  ఇందులో నాలుగు సార్లు భారత్, మూడు సార్లు లంకేయులు   గెలిచి  టోర్నీ  దక్కించుకున్నారు. మొత్తంగా  ఆసియా కప్ ఫైనల్‌లో లంక 12 సార్లు  ఫైనల్ చేరగా  భారత్  11 సార్లు  తుది పోరుకు అర్హత సాధించింది. 


- ఆసియా కప్ 1984లో మొదలైంది. తొలి ఏడాది ఈ  టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరిగింది.    ఈ ఫార్మాట్‌లో భారత్ విజేతగా నిలవగా లంక రన్నరప్‌గా ఉంది. 


- 1986 నుంచి ఆసియా కప్‌లో భారత్ ఆడలేదు.   కానీ ఈసారి శ్రీలంక.. పాకిస్తాన్‌పై ఫైనల్ గెలిచింది. 


- 1988, 1990, 1995, 1997లలో  ఫైనల్ పోరు భారత్ - శ్రీలంక మధ్యే జరిగింది. 1988, 1990, 1995లలో  భారత్ కప్ గెలవగా 1997లో లంక విజేతగా నిలిచింది. 


- 2000లో పాక్ - లంక మధ్య ఫైనల్ జరుగగా  పాకిస్తాన్ తొలిసారి కప్ కొట్టింది.  మళ్లీ 2004, 2008, 2010లో  భారత్ - లంకలే ఫైనల్ పోరులో తలపడ్డాయి.   2004, 2008లో లంక విజేతగా నిలవగా  2010లో  భారత్ కప్ కొట్టింది.






- 2010 తర్వాత భారత్ - లంకలు ఫైనల్ ఆడలేదు.  2012లో పాక్ - బంగ్లా  మధ్య ఫైనల్ జరుగగా పాక్  విజయం సాధించింది.  2014లో శ్రీలంక  నెగ్గింది. 20‌16, 2018లలో  భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్యే ఫైనల్ జరగగా భారత్‌నే విజయం వరించింది.   ఇక 2022లో   దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌ శ్రీలంక - పాకిస్తాన్ మధ్య జరుగగా  లంకేయులే ఆసియా కప్ టోర్నీని ఎగురేసుకుపోయారు.  


- ఆసియా కప్‌లో  1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018లలో భారత్ విజేతగా నిలిచింది. 1997, 2004, 2008లో రన్నరప్‌గా నిలిచింది. 


- శ్రీలంక 1986, 1997, 2004, 2008, 2014, 2022 లలో విజేతగా నిలిచారు. 


- పాకిస్తాన్ 2000, 2012 లలో గెలిచింది. 






రోహిత్‌కు ఐదో ఫైనల్.. 


ప్రస్తుత భారత సారథి  రోహిత్ శర్మకు  ఆదివారం నాటి మ్యాచ్  ఐదో ఆసియా కప్ ఫైనల్. ఆసియా కప్ చరిత్రలో ఐదు ఫైనల్స్ ఆడిన తొలి ఆటగాడు రోహిత్ మాత్రమే. 2008, 2010,  2016 (టీ20),  2018 ఫైనల్స్‌లో  హిట్‌మ్యాన్ ప్రాతినిథ్యం వహించాడు.  









ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial