Asia Cup 2023:  ఆసియా కప్ - 2023లో ఫైనల్ పోరుకు ముందు శ్రీలంకకు భారీ షాక్.  ఆ జట్టు స్టార్  స్పిన్నర్ మహీశ్ తీక్షణ.. ఆదివారం (సెప్టెంబర్ 17)  భారత్‌తో జరిగే ఫైనల్ పోరులో  ఆడేది అనుమానంగానే ఉంది.    సూపర్ - 4 లో భాగంగా పాకిస్తాన్‌తో రెండ్రోజుల క్రితం ముగిసిన  మ్యాచ్‌లో  తీక్షణ గాయపడ్డాడు.  అతడికి అయిన  ఇంజ్యూరీని లంక క్రికెట్ వర్గాలు  గ్రేడ్ - 2 గాయంగా పేర్కొంటున్నారు. వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే  తీక్షణను ఫైనల్ ఆడించకపోవడమే బెటర్ అనే అభిప్రాయంలో లంక ఉంది. 


ఆదివారం భారత్ - శ్రీలంక మ్యాచ్‌కు ఇరు జట్ల ఆటగాళ్లూ సిద్ధపడుతుండగా లంకకు మాత్రం పరిస్థితులు అనుకూలించడం లేదు. ఆటగాళ్ల గాయాలు ఆ జట్టును వేధిస్తున్నాయి. టోర్నీ ప్రారంభంలోనే లంక ప్రధాన  పేసర్లు దుష్మంత చమీర, దిల్షాన్ మధుశంక, లాహిరు కుమారతో పటు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ కూడా  గాయంతో తప్పుకున్నారు. అయినా లంక ఉన్న బౌలర్లతోనే బండి లాగుకొస్తుంది.  బంగ్లాదేశ్, అఫ్గాన్, పాక్‌లను ఓడించి ఆసియా కప్ ఫైనల్‌కు చేరింది.  






స్పిన్‌కు అనుకూలిస్తున్న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోని పిచ్‌పై తీక్షణ లేకపోవడం లంకకు షాకే.  ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన తీక్షణ 8 వికెట్లు తీసి ఆ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు.  ఇటీవలే పాకిస్తాన్‌తో ముగిసిన సూపర్ - 4 మ్యాచ్‌లో  9 ఓవర్లు వేసిన తీక్షణ.. ఒక వికెట్ పడగొట్టాడు.   ఆరంభంలో   ప్రత్యర్థి పరుగులను కట్టడి చేయడానికి  లంక కెప్టెన్ శనక..  పేసర్‌తో పాటు తీక్షణ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాడు. తనదైన బౌలింగ్‌తో   బ్యాటర్లను సవాల్ విసరుతున్న  తీక్షణ.. ఆదివారం భారత్‌తో ఫైనల్ ఆడేది అనుమానమేనని లంక బోర్డు వర్గాలు తెలిపాయి. 


 






 






సోషల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించి పలువురు స్పందిస్తున్నారు. తీక్షణ స్థానంలో లంక సహన్ అర్చిగె‌ను  జట్టులోకి భర్తీ చేయనుందని సమాచారం.  నాలుగు రోజుల క్రితం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో  టీమిండియా బ్యాటర్లు దునిత్ వెల్లలాగే  స్పిన్‌ను అర్థం చేసుకోవడంలో తడబడ్డారు. అదే మ్యాచ్‌లో తీక్షణ  వికెట్లు తీయకపోయినా పరుగులను కట్టడి చేసి ఒత్తిడి పెంచాడు.  







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial