ఆసియా కప్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగులతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. అనంతరం భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (121: 133 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లు) శతకం సాధించాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (80: 85 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తౌహిద్ హృదయ్ (54: 81 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో ముస్తాఫిజుర్ కూడా మూడు వికెట్లు దక్కించుకున్నాడు.
గిల్ ఒంటరి పోరాటం
266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ (0: 2 బంతుల్లో) అవుటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ (5: 9 బంతుల్లో, ఒక ఫోర్) కూడా విఫలం కావడంతో భారత్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సెకండ్ డౌన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (19: 39 బంతుల్లో, రెండు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ఈ దశలో మెహదీ హసన్... కేఎల్ రాహుల్‌ను పెవిలియన్ బాట పట్టించాడు.
అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్ (5: 9 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఒక ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ ఒంటరి పోరాటం సాగించగా... మరో ఎండ్‌లో వచ్చిన వారెవరూ క్రీజులో నిలబడలేకపోయారు. శుభ్‌మన్ ఒక్కడే ఒక పిచ్‌లో, మిగతా అందరూ మరో పిచ్‌లో ఆడినట్లు ఉంటుంది. శుభ్‌మన్ గిల్ ఉన్నంత సేపు ఎన్ని వికెట్లు పడ్డా విజయం భారత్‌దే అనిపించింది. కానీ 44వ ఓవర్లో గిల్‌ను అవుట్ చేసి మెహదీ హసన్ భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. అక్షర్ పటేల్ (42: 34 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కాసేపు మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించాడు. కానీ కీలక తరుణంలో అవుటయ్యాడు. చివరి వరుస బ్యాటర్లు చేతులెత్తేయడం భారత్ 259 పరుగులకు ఆలౌట్ అయింది. విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఆగిపోయింది.
తడబడి... నిలబడి
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా టైగర్స్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఆరు ఓవర్లలోపే మూడు వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోరు 13 వద్దే ఓపెనర్ లిట్టన్ దాస్ (0: 2 బంతుల్లో)ను మహ్మద్ షమి బౌల్డ్ చేశాడు. మరో 2 పరుగులకే తన్‌జిద్ హసన్ (13: 12 బంతుల్లో, మూడు ఫోర్లు) వికెట్లను శార్దూల్ ఎగరగొట్టాడు. మరికాసేపటికే అనమల్ హఖ్ (4: 11 బంతుల్లో, ఒక ఫోర్)ను అతడే ఔట్ చేశాడు. ఇక నిలబడ్డారు అనుకొనే క్రమంలోనే మెహదీ హసన్ మిరాజ్ (13: 28 బంతుల్లో, ఒక ఫోర్)ను అక్షర్ పటేల్ పెవిలియన్‌కు పంపించాడు. అప్పటికి స్కోరు 14 ఓవర్లకు 59.
టాప్ ఆర్డర్ వికెట్లు చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌ను కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (80: 85 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), తౌహిద్ హృదయ్ (54: 81 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఆదుకున్నారు. టీమ్‌ఇండియా స్పిన్నర్లు, పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఊరించే బంతుల్ని వదిలేశారు. చెత్త బంతుల్ని వేటాడారు. సింగిల్స్, డబుల్స్‌తో వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. ఐదో వికెట్‌కు 115 బంతుల్లో 101 పరుగుల అత్యంత కీలక భాగస్వామ్యం అందించారు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న షకిబ్ ఆ తర్వాత వేగం పెంచడంతో 33 ఓవర్లు బంగ్లా స్కోరు 160/4కు చేరుకుంది. మరోవైపు హృదయ్ 77 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శార్దూల్ విడదీశాడు. 33.1వ బంతికి షకిబ్‌ను బౌల్డ్ చేశాడు. మరికాసేపటికే షమిమ్‌ను జడ్డూ, హృదయ్‌ను షమి ఔట్ చేయడంతో 41.2 ఓవర్లకు బంగ్లా 193/7తో నిలిచింది.
మిడిలార్డర్లో షకిబ్, హృదయ్ ఔటైనా బంగ్లా భారీ స్కోరు చేసిందంటే నసుమ్ అహ్మద్ పోరాటమే కారణం. బంతికో పరుగు చొప్పున సాధించాడు. హృదయ్‌తో కలిసి 32 (43 బంతుల్లో), మెహదీ హసన్‌తో కలిసి 45 (36 బంతుల్లో) విలువైన భాగస్వామ్యాలు అందించాడు. కీలకంగా మారిన అతడిని జట్టు స్కోరు 238 వద్ద ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేశాడు. ఆఖరికి మెహదీ హసన్ (29 నాటౌట్: 23 బంతుల్లో, మూడు ఫోర్లు), తన్‌జిన్ హసన్ (14 నాటౌట్: ఎనిమిది బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అజేయంగా నిలిచారు.