ODI World Cup 2023: మరో మూడు వారాలలో మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్‌కు ముందే ఐదు సార్లు ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టును గాయాలు వేధిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ వరల్డ్ కప్ ఆడతారా..? లేదా..? అన్న ఆందోళనలో ఉన్నారు. ఇదివరకే స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు గాయపలబారిన పడగా తాజాగా మరో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కూ గాయాలయ్యాయి.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా శుక్రవారం సఫారీ టీమ్‌తో జరిగిన నాలుగో వన్డేలో ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. నిన్నటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్ గెరాల్డ్ కోయిట్జ్ వేసిన బంతి.. హెడ్ ఎడమచేతికి బలంగా తాకింది. దీంతో నొప్పిని తట్టుకోలేక అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే హెడ్‌కు తాకిన గాయం గురించి మ్యాచ్ అనంతరం జట్టు హెడ్‌కోచ్ మెక్‌డొనాల్డ్ అప్డేట్ ఇస్తూ.. అతడి చేయికి బంతి బలంగా తాకడం వల్ల లోపల ఫ్రాక్చర్ అయిందని వెల్లడించాడు. అతడి స్థానంలో ఐదో వన్డేలో కామెరూన్ గ్రీన్ ఆడే అవకాశం ఉంది. గాయం తీవ్రతను బట్టి చూస్తే హెడ్ వరల్డ్ కప్ ఆడతాడా..? లేదా..? అన్నదీ అనుమానంగానే ఉంది.
ఇదివరకే ఆస్ట్రేలియా జట్టులో గాయాలు వేధిస్తున్నాయి. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, సారథి పాట్ కమిన్స్ మణికట్టు గాయాలతో బాధపడుతున్నారు. మిచెల్ స్టార్క్ గజ్జల్లో గాయంతో సఫారీ టూర్‌కు దూరమయ్యాడు. సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ చీలమండ గాయంతో తిరిగి సిడ్నీకి తిరిగొచ్చాడు. సఫారీ సిరీస్ ముగిశాక ఆసీస్.. భారత్‌తో మూడు వన్డేలు ఆడేందుకు గాను ఈనెలాఖరున ఇండియాకు రానుంది. ఈ సిరీస్‌కు కూడా పైన పేర్కొన్న ఆటగాళ్లు వచ్చేది అనుమానంగానే ఉంది.
అక్టోబర్ 5 నుంచి మొదలుకాబోయే వన్డేవరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా.. ప్రపంచకప్ వేటను భారత్‌తో మ్యాచ్ ద్వారానే మొదలుపెట్టనుంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞులతో కూడిన స్ట్రాంగ్ టీమ్‌ను ఆసీస్ ఎంపిక చేసింది. ఈ ప్రపంచకప్‌లో ఆసీస్.. ఏకంగా ముగ్గురు పేస్ ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక స్పిన్ ఆల్ రౌండర్ , నలుగురు పేసర్లు, ఐదుగురు స్టార్ బ్యాటర్లతో బరిలోకి దిగుతోంది.
వన్డే వరల్డ్ కప్‌కు ఆసీస్ జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హెజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవడ్ వార్నర్, ఆడమ్ జంపా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial