Asia Cup 2023: మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. అసలే భారత్‌తో సోమవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో 228 పరుగుల భారీ తేడాతో ఓడిన పాకిస్తాన్‌కు మరో షాక్ తాకింది. ఆ జట్టు ప్రధాన పేసర్లు అయిన హరీస్ రౌఫ్, నసీమ్ షాలతో పాటు మిడిలార్డర్ బ్యాటర్ అఘా సల్మాన్ కూడా గాయాలతో సతమతమవుతున్నరు. ఈ ముగ్గురూ ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో తలపడే మ్యాచ్‌లో ఆడేది అనుమానంగానే ఉంది.
ఏమైంది..?
ఆదివారం భారత్ - పాకిస్తాన్ మధ్య తొలి రోజు ఆటలో హరీస్ రౌఫ్ ఆడాడు. కానీ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన మ్యాచ్‌లో అతడు డగౌట్‌కే పరిమితమయ్యాడు. కడుపులో మంటతో పాటు పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్న హరీస్.. నిన్న బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూ రాలేదు. అతడు శ్రీలంకతో ఈనెల 14న జరిగే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తున్నది.
ఇక నిన్నటి మ్యాచ్‌లో 9.2 ఓవర్లు బౌలింగ్ చేసిన నసీమ్ షా కూడా ఆఖరి ఓవర్‌కు ముందు గ్రౌండ్‌ను వీడాడు. భుజం నొప్పితో అతడు మైదానం విడిచి పెవిలియన్‌కు చేరాడు. హరీస్ రౌఫ్‌తో పాటు నసీమ్ షా కూడా బ్యాటింగ్‌కు రాలేదు.
ఈ ఇద్దరితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ అఘా సల్మాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిన్న మ్యాచ్‌లో రవీంద్ర జడేజా వేసిన ఓవర్‌లో స్వీప్ చేయబోయిన సల్మాన్ బ్యాట్‌కు తాకిన బంతి బలంగా వచ్చి అతడి ముఖానికి తగిలింది. దీంతో అతడికి ముక్కు, కుడి కన్ను మధ్య భాగంలో గాయమైంది. గాయంతోనే అతడు ఆట కొనసాగించాడు. కానీ నిన్న రాత్రి అతడికి స్కాన్ చేయించినట్టు సమాచారం. సల్మాన్ తదుపరి మ్యాచ్‌లో ఆడేది లేనిది అనుమానంగానే ఉంది.
అందుకే ఆడించలేదా..?
భారత్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాకపోవడంతో హరీస్ రౌఫ్, నసీమ్ షాలకు ఏమైంది..? అని పాక్ అభిమానులు ఆందోళన పడ్డారు. అయితే వచ్చేనెలలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ దృష్ట్యానే ముందు జాగ్రత్తగా హరీస్, నసీమ్‌లను బ్యాటింగ్‌కు పంపకుండా ఉన్నట్టు తెలుస్తున్నది. బౌలింగ్‌లో పాకిస్తాన్‌కు ఈ ఇద్దరూ కీలకం. మిడిలార్డర్‌లో అఘా సల్మాన్ కూడా కీలక ఆటగాడే. దీంతో ఈ ముగ్గురినీ శ్రీలంకతో మ్యాచ్‌లో రెస్ట్ ఇవ్వడమే బెటర్ అన్న అభిప్రాయంలో పాకిస్తాన్ మేనేజ్మెంట్ ఉంది. హరీస్, నసీమ్‌లు శ్రీలంకతో మ్యాచ్‌తో పాటు ఒకవేళ పాక్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం లేకపోవడంతో పీసీబీ.. పేసర్ షహన్వాజ్ దహానీ, జమాన్ ఖాన్‌లను ఆగమేఘాల మీద శ్రీలంకకు పిలిచింది. ఆసియా కప్‌లో పాకిస్తాన్.. ఈనెల 14న శ్రీలంకతో ఆడుతుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial