BAN vs SL:
ఆసియాకప్ 2023లో గురువారం రెండో మ్యాచ్ జరుగుతోంది. పల్లెకెలో వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
'మేం మొదట బ్యాటింగ్ చేస్తాం. వికెట్ మందకొడిగా అనిపిస్తోంది. ప్రత్యర్థికి మేం మంచి టార్గెట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. శ్రీలంక మంచి జట్టని తెలుసు. అందుకే మేం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అత్యుత్తమంగా ఉండాలి. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతున్నాం' అని బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ అన్నాడు.
'టాస్ గెలిస్తే మేమూ మొదట బ్యాటింగే చేయాలని అనుకున్నాం. వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో టాస్ ఓడినా మంచిదే. ఫ్లడ్ లైట్ల వెలుతురులో వికెట్ మాకు అనుకూలిస్తుంది. నలుగురు ప్రధాన ఆటగాళ్లు గాయపడ్డటప్పటికీ అన్ని విభాగాలను కవర్ చస్త్రశాం. సాధారణంగా ఈ వికెట్లో బంతి స్పిన్ అవుతుందని ఆశిస్తాం. ఎందుకంటే పిచ్‌పై కొన్ని నెర్రలు ఉన్నాయి. ఆరుగురు బ్యాటర్లు ఉన్నారు. ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు బౌలర్లను తీసుకున్నాం. మతీశ పతిరన, డునిత్ వెల్లాలగే ఆడుతున్నారు' అని శ్రీలంక కెప్టెన్ దసున్ శనక తెలిపాడు.
బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, తన్‌జిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తోహిద్ హృదయ్, షకిబ్ అల్ హసన్, ముష్పికర్ రహీమ్, మెహెదీ హసన్, మెహదీ హసన మీర్జా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
శ్రీలంక: పాతుమ్ నిసాంక, దిముతు కరుణరత్నె, కుశాల్ మెండిస్, సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ శనక, దునిత్ వెల్లలగే, మహీశ్ థీక్షణ, కసున్ రజిత, మతీశ పతిరన
పిచ్ రిపోర్ట్: మాజీ క్రికెటర్లు మాథ్యూ హెడేన్, మార్వాన్ ఆటపట్టు ఈ పిచ్‌ను పరిశీలించారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. వికెట్‌పై బాగుండటంతో తొలి సెషన్లో స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారని అన్నారు. రెండో ఇన్నింగ్సులో పేస్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ వికెట్‌పై రెండో బ్యాటింగే మంచిదని సూచించారు.
గాయాల లంక..
దుష్మంత చమీర, దిల్షాన్ మధుశంక, లాహిరు కుమార, వనిందు హసరంగ.. నలుగురు కీలక బౌలర్లు లేకుండానే లంక బరిలోకి దిగుతోంది. పైన పేర్కొన్నవారిలో ముగ్గురు లంక పేస్ బౌలింగ్‌కు కర్త, కర్మ, క్రియలు. ఇక స్టార్ స్పిన్నర్ హసరంగ కూడా గాయం కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకున్నాడు. వీరి నిష్క్రమణ లంక టీమ్‌ను వీక్ చేసిందని చెప్పక తప్పదు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) లో లంకకు విజయాలు అందించడంలో ఈ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వీరి స్థానాన్ని లంక యువ బౌలర్లు మహీశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, కసున్ రజిత ఏ మేరకు నిర్వహిస్తారనేది ఆసక్తికరం.
బ్యాటింగ్‌లో లంక కాస్త బెటర్‌గానే ఉంది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నె, పతుమ్ నిస్సంకలతో పాటు వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ మంచి టచ్‌లోనే ఉన్నారు. మిడిలార్డర్‌లో సమరవిక్రమ, చరిత్ అసలంక తో పాటు కెప్టెన్ దసున్ శనక ఆల్ రౌండ్ బాధ్యతలు పోషించాల్సి ఉంది. మరి షకిబ్ అల్ హసన్ బౌలింగ్ ఎటాక్‌ను లంక బ్యాటర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. స్వదేశంలో ఆడుతుండటం లంకకు కలిసొచ్చేదే.