Asia Cup Top Scorer: ఆసియా కప్‌ 2022కు మరెన్నో రోజుల్లేవ్‌! ఆగస్టు 27నే టోర్నీ మొదలు. ఆ మరుసటి రోజే భారత్‌, పాకిస్థాన్‌ సమరం! ఇప్పటి దాకా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఎంతో మంది బ్యాటర్లు ఫ్యాన్స్‌ను అలరించారు. భారత్‌, శ్రీలంక ఆటగాళ్లు మాత్రం నువ్వా నేనా అన్న రేంజులో పోటీపడ్డారు. టాప్‌-6లో నిలిచారు. ఇంతకీ వారెవరంటే?


సనత్‌ జయసూర్య: అంతర్జాతీయ క్రికెట్లో సనత్‌ జయసూర్య తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్నాడు. అనేక అంతర్జాతీయ టోర్నీల్లో తన ప్రతాపం చూపించాడు. అతడు బ్యాటింగ్‌ చేస్తుంటే స్టేడియాలు చిన్నబోయేవి. ఆసియాకప్‌లో అతడే టాప్‌ స్కోరర్‌. 25 మ్యాచుల్లో 53.03 సగటు, 102 స్ట్రైక్‌రేట్‌తో 1220 పరుగులు చేశాడు. అత్యధికంగా 6 సెంచరీలు బాదేశాడు. 3 హాఫ్‌ సెంచరీలు కొట్టేశాడు.


కుమార సంగక్కర: ఆసియాకప్‌ చరిత్రలో రెండో టాప్‌ స్కోరర్‌ కుమార సంగక్కర. కెప్టెన్‌ లంక జట్టుకు అతడెన్నో విజయాలు అందించాడు. కీపర్‌గానూ రికార్డులు సృష్టించాడు. టాప్‌ ఆర్డర్లో దుమ్మురేపే సంగా ఈ టోర్నీలో 24 మ్యాచులు ఆడాడు. 48.86 సగటు, 84.51 స్ట్రైక్‌రేట్‌తో 1075 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి.


సచిన్‌ తెందూల్కర్‌: టీమ్ఇండియా దిగ్గజం సచిన్‌ 1990 నుంచి 2012 వరకు ఆసియాకప్‌లో ఆడాడు. క్రీజులో ఉన్నంత వరకు అభిమానులను అలరించాడు. బ్యాటుతోనే కాదు బంతితోనూ రాణించాడు. 23 మ్యాచుల్లో 51.10 సగటు, 85 స్ట్రైక్‌రేట్‌తో 971 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాదేశాడు. ఆసియాకప్‌లో ఎక్కువ బౌండరీలు బాదిన రెండో ఆటగాడూ మాస్టర్‌ బ్లాస్టరే. 108 బౌండరీలు, 8 సిక్సర్లు దంచాడు.


షోయబ్‌ మాలిక్‌: పాక్‌ నుంచి టాప్‌-5లో నిలిచిన ఏకైక ఆటగాడు షోయబ్‌ మాలిక్‌. 2000 నుంచి 2018 వరకు ఆసియా కప్‌ ఆడాడు. 21 మ్యాచుల్లో 64.78 సగటు, 93 స్ట్రైక్‌రేట్‌తో 907 పరుగులు సాదించాడు. మూడు సెంచరీలు, నాలుగు హాఫ్‌ సెంచరీలు అందుకున్నాడు. టాప్‌ ఆర్డర్‌ నుంచి మిడిలార్డర్‌ వరకు అనేక పాత్రలు పోషించాడు.


రోహిత్‌ శర్మ : ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో రోహిత్‌ శర్మ ఒకడు. అతడు క్రీజులో నిలిచాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు తప్పదు. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో సెంచరీలతో మాయ చేయడం అతడి అలవాటు. ఆసియాకప్‌లో ఇప్పటి వరకు అతడు 27 మ్యాచులు ఆడాడు. 42.04 సగటు, 90 స్ట్రైక్‌రేట్‌తో 883 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఏడు హాఫ్‌ సెంచరీలు బాదేశాడు. 77 బౌండరీలు, 21 సిక్సర్లు బాదాడు.


విరాట్‌ కోహ్లీ: ఈ పేరు వింటేనే అభిమానులకు ఓ పులకరింత. అతడు క్రీజులో ఉంటే అపోజిషన్‌ వాళ్లకు దడ తప్పదు. అత్యంత సునాయాసంగా భారీ లక్ష్యాలను ఛేదించే కింగ్‌ కోహ్లీ ఆసియా కప్‌ ఆడింది తక్కువే. కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ఎక్కువగా విశ్రాంతి తీసుకొనేవాడు. ఇప్పటి వరకు టోర్నీలో 16 మ్యాచులాడిన విరాట్‌ 63 సగటు, 99 స్ట్రైక్‌రేట్‌తో 766 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఆరో స్థానంలో నిలిచాడు.