Cheteshwar Pujara century: టీమ్‌ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో డబుల్ సెంచరీలతో మోత మోగించిన అతడు ఇప్పుడు వన్డే క్రికెట్లో సెంచరీల వరద పారిస్తున్నాడు. తాజాగా రాయల్ లండన్ వన్డే కప్‌లో మూడో శతకం అందుకున్నాడు. అంతే కాదండోయ్! లిస్ట్-ఏ క్రికెట్లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ సగటు రికార్డులను బద్దలుకొట్టాడు.
ఇంగ్లిష్ దేశవాళీ క్రికెట్లో చెతేశ్వర్ పుజారా పరుగుల వరద పారిస్తున్నాడు. తన కెప్టెన్సీతో ససెక్స్ జట్టుకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. మంగళవారం హోవ్ వేదికగా మిడిలెక్స్‌తో జరిగిన లిస్ట్-ఏ మ్యాచులో కేవలం 90 బంతుల్లో 132 రన్స్ సాధించాడు. 20 బౌండరీలు, 2 భారీ సిక్సర్లు దంచాడు. అతడు సెంచరీ చేసేందుకు 75 బంతులే తీసుకోవడం ప్రత్యేకం. ఆఫ్ సైడ్ దూరంగా వెళ్తున్న బంతులనూ నయావాల్ అందమైన కవర్‌డ్రైవ్‌లుగా మలిచాడు. అతడికి తోడుగా ఓపెనర్ టామ్ అస్లోప్ 189 (155 బంతుల్లో)తో అజేయంగా నిలిచాడు. దాంతో ససెక్స్ 50 ఓవర్లో 400 స్కోర్ చేసింది.
రాయల్ లండన్ వన్డే కప్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచులాడిన పుజారా 102 సగటు, 116.28 స్ట్రైక్‌రేట్‌తో 614 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతకు ముందు కౌంటీ క్రికెట్లో 109.4 సగటుతో 1000కు పైగా పరుగులు చేశాడు. ఐదు సెంచరీలు అందుకున్నాడు. అందులో మూడు డబుల్ సెంచరీలే కావడం గమనార్హం. కెప్టెన్ టామ్ హైన్స్ గాయపడటంతో ఈ సీజన్లో ససెక్స్‌ను పుజారానే నడిపిస్తుండటం ప్రత్యేకం.
లిస్ట్-ఏ క్రికెట్లో పుజారా తన సగటును 57.49కి పెంచుకున్నాడు. విరాట్ కోహ్లీ (56.50), బాబర్ ఆజామ్ (56.56)ని అధిగమించాడు. మొత్తంగా లిస్ట్-ఏ క్రికెట్లో నయావాల్ మూడో స్థానంలో నిలిచాడు. సామ్ హెయిన్ (58.84), మైకేల్ బేవాన్ (57.86) అతడి కన్నా ముందున్నారు.