Ashwin and Bairstow Set to Play Their 100th Test in Dharamshala: ధర్మశాల(Dharamshala) వేదికగా మార్చి 7 నుంచి 11 వరకు అయిదో టెస్ట్‌ జరగనుంది. ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా(Team India).. ఈ టెస్ట్‌లోనూ గెలిచి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(WTC) పాయింట్లు పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని బ్రిటీష్‌ (England) జట్టు చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు అరుదైన రికార్డు సృష్టించనున్నారు. టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్రన్ అశ్విన్‌, ఇంగ్లాండ్ బ్యాట‌ర్ జానీ బెయిర్ స్టోలకు ఈ మ్యాచ్  ప్రతిష్టాత్మకంగా నిల‌వ‌నుంది. అశ్విన్‌, జానీ బెయిర్ స్టోలు త‌మ కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు ఎలా రాణిస్తారు అన్న అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ మ్యాచ్ ఎవ‌రికి తీపి గుర్తుగా మిగ‌ల‌నుందో మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది.


కేవలం 13 మంది మాత్రమే
టీమ్ఇండియా త‌రుపున ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 13 మంది ఆట‌గాళ్లు మాత్రమే టెస్టుల్లో వంద‌కు పైగా మ్యాచ్‌లు ఆడారు. అశ్విన్ 14వ ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. భార‌త్ త‌రుపున అత్యధిక టెస్టులు ఆడిన ఆట‌గాళ్ల జాబితాలో స‌చిన్ టెండూల్కర్  200 టెస్టులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత 163 టెస్టుల‌తో రాహుల్ ద్రవిడ్ రెండో స్థానంలో ఉన్నాడు. స‌చిన్ టెండూల్క‌ర్ 200 టెస్టులు ఆడగా... రాహుల్ ద్రవిడ్ 163 ఆడగా.. వీవీఎస్‌ లక్ష్మణ్ 134, అనిల్‌ కుంబ్లే 132, కపిల్‌ దేవ్ 131, సునీల్‌ గవాస్కర్ 125, దిలీప్‌ వెంగ్‌సర్కార్ 116, సౌరవ్‌ గంగూలీ 113, విరాట్‌ కోహ్లీ 113, ఇషాంత్‌ శర్మ 105, హర్భజన్‌ సింగ్ 103, ఛతేశ్వర్‌ పుజారా 103, వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్ట్‌లు ఆడారు. అశ్విన్  ఇప్పటి వ‌ర‌కు 99 టెస్టులు ఆడాడు. 507 వికెట్లు ప‌డ‌గొట్టాడు. బ్యాటింగ్‌లో 3309 ప‌రుగులు చేశాడు. ఇటీవ‌ల ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఇంగ్లాండ్ త‌రుపున ఇప్పటి వ‌ర‌కు బెయిర్ స్టో 99 టెస్టులు ఆడాడు 36.43 స‌గ‌టుతో 5974 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.


అశ్వినే టాప్‌
టీమిండియా స్పిన్‌ మాంత్రికుడు, క్రికెట్‌ జీనియస్‌ రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin) మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అయిదు వికెట్లు తీసిన అశ్విన్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో స్వదేశంలో 351 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో తనకంటే ముందున్న అనిల్ కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు. అశ్విన్, కుంబ్లే మినహా టెస్టుల్లో మరే ఇతర భారతీయ బౌలర్ స్వదేశంలో 300 వికెట్లు పడగొట్టలేదు. 265 వికెట్లతో హర్భజన్ సింగ్ మూడో స్థానంలో... 219 వికెట్లతో కపిల్‌ నాలుగో స్థానంలో.. 210 వికెట్లతో రవీంద్ర జడేజా అయిదో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయంగా చూస్తే శ్రీలంక మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన స్వదేశంలో ఏకంగా 493 వికెట్లు తీయగా.. ఇంగ్లాండ్‌ పేసర్‌ అండర్సన్ స్వదేశంలో 434 వికెట్లు తీశాడు. మరో ఇంగ్లండ్ స్టార్ స్టువర్ట్ బ్రాడ్ స్వదేశంలో 398 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.